Advertisement

  • ముంబై ఇండియన్స్ పై సూపర్ ఓవర్ తో విజయాన్ని అందుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

ముంబై ఇండియన్స్ పై సూపర్ ఓవర్ తో విజయాన్ని అందుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

By: chandrasekar Tue, 29 Sept 2020 09:22 AM

ముంబై ఇండియన్స్ పై సూపర్ ఓవర్ తో విజయాన్ని అందుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు


చాలా ఉత్కంఠం మధ్య సాగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై సూపర్ ఓవర్ తో విజయాన్ని పొందింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ‘సూపర్’ పోరులో కోహ్లి సేన విజయం సాధించింది. 202 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబై 20 ఓవర్లలో 201 పరుగులు మాత్రమే చేయడంతో ఇరు జట్ల స్కోర్లు సమం అయ్యాయి. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్‌లో ముంబై ఇండియన్స్ తరఫున పోలార్డ్, హార్దిక్ పాండ్య బరిలో దిగగా నవదీప్ సైనీ 7 రన్స్ మాత్రమే ఇచ్చి పోలార్డ్‌ను ఔట్ చేశాడు. 8 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి ఆర్సీబీ తరఫున డివిలియర్స్, కోహ్లి బరిలో దిగగా ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బంతిని బుమ్రా చేతికి అందించాడు. డివిలియర్స్ ఓ ఫోర్ బాదడంతో సూపర్ ఓవర్ ఆఖరి బంతికి బెంగళూరు విజయానికి ఒక్క పరుగు అవసరమైంది. ఫోర్ బాదిన కోహ్లి మ్యాచ్‌ను గెలిపించాడు. బుమ్రా 1,1,0,4,1,4 చొప్పున పరుగులిచ్చాడు.

రెండు టీంలు హోరా హోరీగా పోటీకి దిగడంతో పరుగుల వర్షం కురిసింది. మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఫించ్ 35 బంతుల్లో 52 పరుగులు చేయగా.. పడిక్కల్ 40 బంతుల్లో 54 రన్స్ చేశాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కోహ్లి 11 బంతులు ఆడి కేవలం 3 రన్స్ మాత్రమే చేసి రాహుల్ చాహర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 24 బంతుల్లో 55 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచిన డివిలియర్స్.. ముంబై ఇండియన్స్‌పై వరుసగా మూడో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఆఖర్లో శివమ్ దూబే 10 బంతుల్లో 27 రన్స్ చేయడంతో కోహ్లి సేన 200కిపైగా పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్ ఆరంభంలోనే 78 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా యువ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. చివరి ఐదు ఓవర్లలో ముంబై విజయానికి 90 పరుగులు అవసరం కాగా ఇషాన్ కిషన్, పోలార్డ్ పవర్ హిట్టింగ్‌కు దిగారు.

ఇషాన్ కిషన్ చాల అద్భుతంగా ఆడి పరుగులు రాబట్టాడు. ముంబై విజయానికి 23 బంతుల్లో 76 రన్స్ అవసరమైన దశలో ఆడమ్ జంపా బౌలింగ్‌లో పోలార్డ్ ఇచ్చిన క్యాచ్‌ను పవన్ నేగి వదిలేశాడు. అది సిక్స్‌గా వెళ్లడంతోపాటు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. ఈ లైఫ్‌తో చెలరేగిన పోలార్డ్ అదే ఓవర్లో మరో రెండు సిక్సులు బాదాడు. జంపా ఓవర్లో 27 రన్స్ రాగా చాహల్ వేసిన 18వ ఓవర్లో 22 రన్స్ వచ్చాయి. ఉడానా వేసిన ఆఖరి ఓవర్లో ముంబై విజయానికి 19 పరుగులు అవసరమయ్యాయి. తొలి రెండు బంతులకు సింగిల్స్ రాగా ఇషాన్ కిషన్ తర్వాతి రెండు బంతులను సిక్స్‌గా మలిచాడు. ముంబై విజయానికి రెండు బంతుల్లో 5 పరుగులు అవసరం కాగా సిక్స్‌కు యత్నించిన కిషన్ 99 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆఖరి బంతికి పోలార్డ్ (24 బంతుల్లో 60) ఫోర్ కొట్టడంతో ఇరు జట్ల స్కోర్లు సమం అయ్యాయి. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్లో ముంబై మ్యాచ్ ఓడినా 9 సిక్సులు, 2 ఫోర్లతో 58 బంతుల్లోనే 99 రన్స్ చేసిన ఇషాన్ కిషన్ అందరి మనసులు గెలిచాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ వికెట్ తీసిన వాషింగ్టన్ సుందర్ 4 ఓవర్లలో కేవలం 12 రన్స్ మాత్రమే ఇచ్చాడు. చివరిగా సూపర్ ఓవర్ లో నవదీప్ సైనీ 7 రన్స్ మాత్రమే ఇవ్వడంతో బెంగుళూరు విజయాన్ని అందుకుంది.

Tags :
|

Advertisement