Advertisement

  • సూపర్ థ్రిల్లింగ్ పోరులో సూపర్ ఓవర్లో విజయం సాధించిన కోహ్లీ సేన

సూపర్ థ్రిల్లింగ్ పోరులో సూపర్ ఓవర్లో విజయం సాధించిన కోహ్లీ సేన

By: Sankar Tue, 29 Sept 2020 07:23 AM

సూపర్ థ్రిల్లింగ్ పోరులో సూపర్ ఓవర్లో విజయం సాధించిన కోహ్లీ సేన


బౌండ్రీల హోరు.. సిక్సర్ల జోరుతో అభిమానులను ఉర్రూతలూగించిన పోరులో చివరకుముంబై ఇండియన్స్ పై బెంగళూరును విజయం వరించింది. ఇరుజట్ల బ్యాట్స్‌మెన్‌ వీరబాదుడుతో మొత్తం 402 పరుగులు నమోదైన మ్యాచ్‌ చివరకు టై అయింది.

అయితే బెంగళూరు తరఫున సూపర్‌ ఓవర్‌ వేసిన నవదీప్‌ సైనీ ముంబై హార్డ్‌ హిట్టర్లను అడ్డుకొని 7 పరుగులు ఇచ్చుకోగా.. కోహ్లీ, డివిలియర్స్‌ ధాటిగా ఆడటంతో బెంగళూరు 11 పరుగులు చేసి విజయం సాధించింది. అంతకుముందు సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన కోహ్లీ సేన నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లకు 201 పరుగులు చేసింది. ఓపెనర్లు దేవదత్‌ పడిక్కల్‌ (40 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), అరోన్‌ ఫించ్‌ (35 బంతుల్లో 52; 7 ఫోర్లు, ఒక సిక్సర్‌) అర్ధశతకాలు బాదగా.. డివిలియర్స్‌ (24 బంతుల్లో 55 నాటౌట్‌; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), శివమ్‌ దూబే (10 బంతుల్లో 27 నాటౌట్‌; ఒక ఫోర్‌, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. కోహ్లీ (3) మరోసారి విఫలమయ్యాడు. ముంబై బౌలర్లలో బౌల్ట్‌కు 2 వికెట్లు దక్కాయి.

అనంతరం లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి సరిగ్గా 201 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ (58 బంతుల్లో 99; 2 ఫోర్లు, 9 సిక్సర్లు), పొలార్డ్‌ (24 బంతుల్లో 60 నాటౌట్‌; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) వీర విజృంభణతో ముంబై అదరగొట్టింది. 16 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 122/4. విజయానికి 24 బంతుల్లో 80 పరుగులు అవసరమైన దశలో పొలార్డ్‌ రెచ్చిపోయాడు. జంపా ఓవర్‌లో 4,6,6,2,6,3తో మొత్తం 27 పరుగులు పిండుకున్నాడు. మరుసటి ఓవర్‌లో పొలార్డ్‌ రెండు, ఇషాన్‌ ఓ సిక్స్‌ బాదడంతో 22 పరుగులు వచ్చాయి. దీంతో సమీకరణం 12 బంతుల్లో 31కి చేరింది. 19 ఓవర్‌లో 12 పరుగులు రాగా.. ఆఖరి ఓవర్‌లో 2 భారీ సిక్సర్లు బాదిన కిషన్‌ సెంచరీకి ఒక్క పరుగు తేడాలో ఔట్‌కాగా.. చివరి బంతికి బౌండ్రీ బాదిన పొలార్డ్‌ మ్యాచ్‌ను టై చేశాడు.

Tags :
|
|
|
|

Advertisement