Advertisement

రోహిత్ స్టయిలే వేరు ..పాక్ క్రికెటర్ హైదర్ అలీ

By: Sankar Fri, 19 June 2020 5:16 PM

రోహిత్ స్టయిలే వేరు ..పాక్ క్రికెటర్ హైదర్ అలీ



టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మపై సహచర ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ ఇటీవల ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. రోహిత్‌ బ్యాటింగ్‌కు తాను వీరాభిమానిని అని పేర్కొన్నాడు. అతడి లాంటి స్టార్‌ ఆటగాడు జట్టులో ఉంటే యువ ఆటగాళ్లకు ఎంతో ప్రేరణ కలుగుతుందన్నాడు.తాజాగా హిట్‌మ్యాన్‌ రోహిత్‌ను పాక్‌ యువ క్రికెటర్‌ హైదర్‌ అలీ సైతం కొనియాడాడు. రోహిత్‌ బ్యాటింగ్‌ అంటే తనకెంతో ఇష్టమని, ప్రత్యేకంగా అతని దూకుడుకు తాను వీరాభిమానని వ్యాఖ్యానించాడు. రోహిత్‌ బ్యాటింగ్‌ స్టైల్‌ తనలో ఎంతో ప్రేరణ తీసుకొచ్చిందని 19 ఏళ్ల హైదర్‌ విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నాడు.

అది టెస్టు మ్యాచ్‌ కావొచ్చు, వన్డే మ్యాచ్‌ కావొచ్చు లేదా టీ20 అయినా కావొచ్చు.. ఏదైనా రోహిత్‌ స్టైలే వేరు. బౌలర్లను ఎటాక్‌ చేసే తీరు అమోఘం. నేను కూడా పాకిస్తాన్‌ జట్టులో అదే తరహా ఆరంభాన్ని ఇవ్వాలని ఎప్పుడూ యత్నిస్తుంటా. అతను నాకు స్ఫూర్తి’ అని హైదర్‌ పేర్కొన్నాడు. త్వరలో ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లబోయే పాకిస్తాన్‌ జట్టులో హైదర్‌ అలీకి చోటు దక్కింది. 29 మందితో కూడిన పాక్‌ జట్టులో హైదర్‌ చోటు దక్కించుకున్నాడు. గత కొంతకాలంగా ఆకట్టుకుంటున్న హైదర్‌ అలీ.. ఈ ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన జూనియర్‌ వరల్డ్‌కప్‌లో భారత్‌తో సెమీ ఫైనల్లో హాఫ్‌ సెంచరీతో మెరిశాడు.

అయితే తనన భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌, పరుగుల మెషీన్‌ విరాట్‌ కోహ్లితో పోల్చడంపై కూడా హైదర్‌ అలీ కొన్ని నెలల క్రితం పెదవి విప్పాడు. తనను కోహ్లితో పోల్చవద్దంటూ విన్నవించాడు. కేవలం తమ దేశానికి చెందిన బాబర్‌ అజామ్‌తో పోల్చితేనే బాగుంటుందన్నాడు. బాబర్‌ అజామ్‌ మంచి షాట్లు ఆడతాడని, అతనిలా షాట్లు ఆడాలని అనుకుంటూ ఉంటానన్నాడు. ప్రాక్టీస్‌లో ఎక్కువగా బాబర్‌ను అనుకరిస్తానని అన్నాడు. అంతేకానీ కోహ్లిలా ఉండాలని అనుకోవడం లేదన్నాడు. తాను తనలాగే ఉండటమే ఇష్టమన్నాడు. ఎవరితోనూ పోలికను పెద్దగా ఇష్టపడనన్నాడు. పాక్‌ క్రికెట్‌కు హైదర్‌ అలీ రూపంలో కోహ్లి దొరికాడంటూ మాజీ క్రికెటర్‌ రమీజ్‌ రాజా ఈ ఏడాది మార్చిలో చేసిన వ్యాఖ్యలపై హైదర్‌ ఇలా స్పందించాడు.

Tags :
|
|

Advertisement