Advertisement

  • అతిభారీ వర్షానికి దెబ్బతిన్న రోడ్లు... రూ.500 కోట్లకుపైగా నష్టం...

అతిభారీ వర్షానికి దెబ్బతిన్న రోడ్లు... రూ.500 కోట్లకుపైగా నష్టం...

By: chandrasekar Thu, 15 Oct 2020 08:23 AM

అతిభారీ వర్షానికి దెబ్బతిన్న రోడ్లు... రూ.500 కోట్లకుపైగా నష్టం...


రాష్ట్రంలో కురిసిన అతిభారీ వర్షానికి దెబ్బతిన్న రోడ్లు వల్ల రూ.500 కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా మంగళవారం కురిసిన అతిభారీ వర్షానికి రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చెరువులు ఉప్పొంగడం, గండ్లుపడటంతో వచ్చిన ఉధృతికి సమీప రోడ్లు దెబ్బతిన్నాయి. భారీగా కోతకు గురైతారు అట్టముక్కలా లేచి కొట్టుకునిపోయాయి. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు, విజయవాడ, భూపాలపల్లి వెళ్లే జాతీయ రహదారులకు భారీగా నష్టం వాటిల్లింది. అలాగే సిద్దిపేట, వనపర్తి, ఖమ్మం, కొత్తగూడెం, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో రాష్ట్ర రహదారులు బాగా దెబ్బతిన్నాయి. గత నెల రోజుల్లో కురిసిన భారీ వర్షాలకు రూ.1,200 కోట్ల నష్టం వాటిల్లితే, మంగళవారం ఒక్కరోజే రూ.500 కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. చాలా ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు ఇంకా పారుతుండటంతో తాత్కాలిక మరమ్మతులకు అవకాశం లేకుండా పోయింది. ముఖ్యమైన ప్రాంతాల్లో మాత్రం మట్టి, కంకరతో గుంతలను పూడ్చి వాహనాలను అనుమతిస్తున్నారు.

చాలా ప్రాంతాల్లో నీటి ప్రవాహం వల్ల రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. హైదరాబాద్‌–విజయవాడ 65వ నంబర్‌ జాతీయ రహదారిపై కొత్తగూడ వద్ద విజయవాడవైపు వంతెన అప్రోచ్‌రోడ్డు కోతకు గురై గోతులు ఏర్పడ్డాయి. దీని మీదుగా వాహనాల ప్రయాణం సాధ్యం కాకపోవటంతో ఎడమవైపు కాజ్‌వే మీదుగానే వాహనాలను అనుమతిస్తున్నారు. హైదరాబాద్‌–భూపాలపట్నం 163వ నంబరు జాతీయ రహదారిపై నారపల్లి వద్ద అర కిలోమీటరు వెడల్పుతో వరద నీరు ప్రవహించింది. అందువల్ల వాహనాల రాకపోకలను బుధవారం మధ్యాహ్నం తర్వాత పునరుద్ధరించారు. అలాగే జోడిమెట్ల జంక్షన్‌ వద్ద చెరువు ఉప్పొంగడంతో అర కిలోమీటరు మేర రోడ్డు నీట మునిగింది. నీటి ప్రవాహ వేగం ఎక్కువగా ఉండటంతో బుధవారం మధ్యాహ్నం వరకు వాహనాల రాకపోకలను నిలిపేశారు. ప్రస్తుతం వరదలతో ముంచెత్తిన ప్రాంతాల్లో కొన్ని వంతెనలు కూడా నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. భవిష్యత్తులో ఈ తరహా ముంపు లేకుండా ఉండాలంటే ఆయా ప్రాంతాల్లో పనులు చేపడితే రూ.2 వేల కోట్ల మేర ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జరిగిన నష్టాన్ని పూడ్చి పూర్వపు స్థితికి పునరుద్ధరించాలంటే రూ.500 కోట్ల మేర ఖర్చవుతుందని తెలిపారు.

Tags :
|

Advertisement