Advertisement

  • మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి అరెస్టు

మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి అరెస్టు

By: Dimple Sat, 22 Aug 2020 4:57 PM

మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, మాజీ  ఎంపీ మల్లు రవి  అరెస్టు

శ్రీశైలం జలవిద్యుత్‌ కేంద్రంలో నిన్న జరిగిన అగ్నిప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవిని పోలీసులు అరెస్టు చేశారు. ఉప్పునూతల మండలం లత్తీపూర్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద రేవంత్‌రెడ్డి వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి ఉప్పునూతల పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ... ‘అరెస్టు చేయాల్సింది మమ్మల్ని కాదు. ఘటనకు బాధ్యులైన మంత్రి జగదీశ్‌రెడ్డి, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావులను అరెస్టు చేయాలి’’ అని పోలీసులకు సూచించారు. జరిగిన ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి, మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించాలి, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. బాధితుల కుటంబాలను పరామర్శించిన తర్వాతే ఇక్కడ్నుంచి వెళ్తామని స్పష్టం చేశారు. ఘటన జరిగిన శ్రీశైలం జలవిద్యుత్‌ కేంద్రాన్ని సందర్శించేందుకు అనుమతి మంజూరు చేయాలని కోరారు. బాధిత కుటుంబాలను పరామర్శించడం ప్రతిపక్షాల బాధ్యత అన్నారు. మరో వైపు రేవంత్‌రెడ్డిని తక్షణం విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ కార్యకర్తలు ఉప్పునూతలలో ఆందోళన చేపట్టారు.

శ్రీశైల ప్రాజెక్టు విద్యుత్‌ కేంద్రం వద్ద జరిగిన ఘటనను పరిశీలించేందుకు వెళ్తున్న రేవంత్‌రెడ్డి, మల్లు రవిని అరెస్టు చేయడం అప్రజాస్వామికమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ‘‘ప్రజాప్రతినిధులుగా ఘటనాస్థలిని పరిశీలించడం, బాధితులను పరామర్శించడం కనీస బాధ్యత. తెలంగాణ ప్రభుత్వం రాక్షసంగా ప్రవర్తిస్తోంది. ప్రభుత్వం తప్పిదాలు బయటపడతాయని పోలీసులను ఉపయోగించి నిర్బంధానికి పాల్పడుతోంది. రేవంత్‌, మల్లు రవిని వెంటనే విడుదల చేసి శ్రీశైలం ఘటనాస్థలాన్ని సందర్శించే విధంగా ఏర్పాటు చేయాలి’’ అని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు.

Tags :

Advertisement