Advertisement

చైనాపై అమెరికా సెనేట్‌ సభ్యులు సభలో తీర్మానం

By: chandrasekar Fri, 14 Aug 2020 6:59 PM

చైనాపై అమెరికా సెనేట్‌ సభ్యులు సభలో తీర్మానం


భారత మరియు చైనా ల మధ్య ఎల్‌ఏసీ రేఖ వద్ద అక్రమంగా చైనా భారత భూభాగంలోకి చొరబడి దాడులు చేయడాన్ని అమెరికా సెనేట్ తీవ్రంగా పరిగణించింది. డ్రాగన్ కంట్రీ తీరును తప్పుబడుతూ అమెరికా సెనేట్‌ సభ్యులు సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. స్టేటస్ కోను చైనా అమలు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడాన్ని సెనేట్ తప్పుబట్టింది. ఈ వ్యవహారంలో చైనా అక్రమంగా సరిహద్దు వద్ద నిర్మాణాలు చేపడుతోందని అదే సమయంలో భారత ప్యాట్రోలింగ్ టీమ్స్‌పై దాడులు చేస్తోందని తీర్మానంలో తెలిపారు.

వాస్తవాధీన రేఖ వెంబడి బలగాలను కూడా పెంచి సరిహద్దు వద్ద మోహరించడాన్ని సెనేట్ తప్పుబట్టింది. ఇక ఈ తీర్మానాన్ని సెనేటర్లు జాన్ కార్నిన్ మరియు మార్క్ వార్నర్‌లు ప్రవేశపెట్టారు. సెనేట్ ఇండియా సహవ్యవస్థాపకులుగా కార్నిన్, భారత్ అమెరికాల మధ్య సత్సంబంధాల బలోపేతానికి కృషి చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. చైనా దుశ్చర్యకు ఎదురొడ్డి పోరాడిన భారత్‌ తీరును ప్రశంసిస్తున్నట్లు చెప్పిన కార్నిన్ భారత్ అమెరికా మిత్రపక్షం కాబట్టి తప్పకుండా అండగా నిలుస్తామని చెప్పారు.

గత కొంత కాలంగా వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దుశ్చర్యలకు పాల్పడుతోంది. ఇది ఒక్కసారిగా ఎక్కువై జూన్ 15వ తేదీన భారత బలగాలపై చైనా బలగాలు దాడి చేశాయి. ఈ ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. జూన్ 15న జరిగిన ఘర్షణ కచ్చితంగా సీరియస్‌గా పరిగణించాల్సిన అంశమని అమెరికా సెనేటర్ వార్నర్ చెప్పారు. చైనా రెచ్చగొట్టే చర్యలకు దిగుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదాస్పద ప్రాంతంలో చైనా ఆక్రమణకు పాల్పడటం సరికాదన్నారు. ఇక అమెరికా సెనేటర్లు ప్రవేశపెట్టిన తీర్మానంలో పలు అంశాలను చేర్చారు.

ఇరు దేశాల వాస్తవాధీనరేఖ వద్ద చైనా యొక్క విద్రోహ చర్యలను ఖండించారు. భారత్ చైనాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతున్న క్రమంలో చైనా తమ బలగాలను మోహరించడాన్ని అమెరికా తప్పుబట్టింది. రెండు దేశాలు చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం కనుగొని ఏప్రిల్ 20 నాటి స్టేటస్ కోను అమలు చేయాలని తీర్మానంలో పొందుపర్చారు. ఇదిలా ఉంటే అమెరికా భారత్‌కు మంచి మిత్రదేశం. కొన్ని దశాబ్దాలుగా అమెరికా భారత్‌లు కలిసి పనిచేస్తున్నాయి. ఇండో పసఫిక్ ప్రాంతంలో శాంతి నెలకొల్పేలా తమ వంతు కృషి చేస్తేనే తమకు బాగుంటుందని వార్నర్ చెప్పారు. గత కొంత కాలంగా చైనా తన పొరుగు దేశాల భూభాగాన్ని ఆక్రమిస్తూ అనేక దుశ్చర్యలకు పాల్పడుతుంది.

Tags :
|
|
|

Advertisement