Advertisement

భారత్ లో ఇంగ్లాండ్ పర్యటన షెడ్యూల్ విడుదల

By: chandrasekar Fri, 11 Dec 2020 5:40 PM

భారత్ లో ఇంగ్లాండ్ పర్యటన షెడ్యూల్ విడుదల


ఐపీఎల్ తరువాత భారత్ టీం ఆస్ట్రేలియా పర్యటనలో బిజీ గా వున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఒన్డే మరియు టీ20 సిరీస్‌ ముగియడంతో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కావలసి వుంది. వచ్చే సంవత్సరం 2021 లో ఇంగ్లాండ్ టీం భారత్లో సుదీర్ఘ పర్యటన చేయనుంది. ఇందుకోసం భారత్ గడ్డపై ఇంగ్లాండ్ టీం సుదీర్ఘ సిరీస్‌ కోసం వచ్చే ఏడాది జనవరిలోనే అడుగుపెట్టబోతోంది. నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలని టీమిండియాతో ఇంగ్లాండ్ టీం ఇక్కడ ఆడనుంది. మార్చి చివరి వరకూ పర్యటనలో పాల్గొననుంది. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సంయుక్తంగా షెడ్యూల్‌ని అధికారికంగా ప్రకటినచారు. ఒకవేళ ఏప్రిల్ ఆరంభంలోనే ఐపీఎల్ 2021 సీజన్‌ని నిర్వహిస్తే ఆ టోర్నీ ముగిసిన తర్వాతే ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లు మళ్లీ స్వదేశానికి వెళ్లనున్నట్లు తెలిసింది. వీరి పర్యటనలో మొదటగా ఫిబ్రవరి 5న చెన్నై వేదికగా తొలి టెస్టు ప్రారంభంకానుండగా ఆ తర్వాత 13 నుంచి రెండో టెస్టు కూడా చెన్నై లోనే జరగనుంది.

అనంతరం 24 నుంచి అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో మూడో టెస్టు డే/నైట్ టెస్టు గా జరగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా రికార్డ్ నెలకొల్పిన మొతెరా స్టేడియం సీటింగ్ సామర్థ్యం 1,10,000 గా వుంది. ఇందులో ఎక్కువసంఖ్యలో అభిమానులు మ్యాచ్ ను వీక్షించవచ్చును. మొతెరా స్టేడియంలో మూడో టెస్టుతో పాటు మార్చి 4 నుంచి నాలుగో టెస్టుని కూడా అక్కడే జరగనుంది. కరోనా వైరస్ వ్యాప్తి అప్పటికి తగ్గుముఖం పడుతుందని ఆశిస్తున్న బీసీసీఐ ఆ తర్వాత ఐదు టీ20ల సిరీస్‌ మ్యాచ్లను మార్చి 12 నుంచి 20 వరకూ అన్నింటిని కూడా మొతెరాలోనే నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించబడింది. ఇక్కడ జరిగే మ్యాచ్లలో ప్రేక్షకుల్ని టీ20 సిరీస్‌కి పూర్తి స్థాయిలో స్టేడియంలోకి అనుమతించే అవకాశాల్ని బీసీసీఐ పరిశీలించనుంది.

ముందు తలపెట్టిన టీ20 సిరీస్ తర్వాత మార్చి 23 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ల కోసం మార్చి 28 వరకూ పుణె ఆతిథ్యమివ్వనుంది. ప్రస్తుతం జనవరి 19 వరకూ ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ ఆడనున్న టీమిండియా ఆ తర్వాత స్వదేశానికి రానుంది. అలానే జనవరిలో శ్రీలంక పర్యటనలో పాల్గొనే ఇంగ్లాండ్ టీమ్ తిరిగి జనవరి 27న భారత్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఈ పర్యటన కోసం ఇరు జట్ల ఆటగాళ్లకి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించి బయో సెక్యూర్ వాతావరణంలో సిరీస్‌ని నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రేక్షకుల అనుమతిపై పూర్తి సమాచారం అందలేదు. పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టనున్నారు.

Tags :
|

Advertisement