Advertisement

  • పాత మార్కెట్‌ విలువల ప్రకారమే రిజిస్ట్రేషన్లు

పాత మార్కెట్‌ విలువల ప్రకారమే రిజిస్ట్రేషన్లు

By: chandrasekar Fri, 30 Oct 2020 2:07 PM

పాత మార్కెట్‌ విలువల ప్రకారమే రిజిస్ట్రేషన్లు


ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ... రాష్ట్రంలో మార్కెట్‌ విలువల మదింపు ఇంకా పూర్తికాలేదని తెలిపారు. ఇప్పటికిప్పుడు ఎలాంటి మార్పులు ఉండవని, పాత మార్కెట్‌ విలువల ప్రకారమే ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయని ప్రకటించారు. గురువారం మూడు చింతలపల్లిలో ధరణి వెబ్‌ పోర్టల్‌ ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించడానికి మరో ఇరవై రోజుల సమయం పట్టవచ్చన్నారు. కొత్త పద్ధతిలో పకడ్బందీగానే ముందుకు వెళ్తున్నామని చెప్పారు. భూ యజమానులు ఎవరైనా తమ వ్యక్తిగత వివరాలు చూపించవద్దనుకొంటే.. వారికి ప్రత్యేకంగా ఒక ఆప్షన్‌ కూడా వెబ్‌ పోర్టల్‌లో ఉంటుందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ‘కొంతమంది తమ వివరాలను రకరకాల కారణాలతో బయటకు వెల్లడించడానికి ఇష్టపడరు. అలాంటివారికి కూడా ఇబ్బంది లేకుండా చూశాం. పూర్తిస్థాయి భూముల సర్వే చేపట్టడానికి కసరత్తు చేస్తున్నాం. దీనికి కొంత సమయం పడుతుంది. కంక్లూజివ్‌ టైటిల్‌ గ్యారెంటీ దిశగా చర్యలు తీసుకొంటున్నాం’ అని సీఎం వివరించారు.

దుబ్బాక నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించారు. దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ విజయం సాధించడం ఖాయమని అన్నారు. అక్కడ టీఆర్‌ఎస్‌ గెలుపుపై తనకు ఎలాంటి అనుమానం లేదని, మంచి మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. మూడుచింతలపల్లిలో ధరణి పోర్టల్‌ ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అక్కడి నుంచి నేరుగా గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొన్నారు. సుమారు గంటపాటు ధరణి పోర్టల్‌ గురించి విడమరిచి చెప్పారు. సామాన్యుడికి కూడా అర్థమయ్యే విధంగా పోర్టల్‌ ఉపయోగాలను తెలిపారు. తర్వాత మూడుచింతలపల్లి శివారులోని లక్ష్మీపూర్‌ దారిలో స్థానిక నాయకులు, రైతులు, మీడియా ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి సహపంక్తి భోజనంచేశారు. భోజనశాలలో కలియదిరుగుతూ.. అక్కడున్నవారిని పేరుపేరునా పలుకరించారు.

Tags :
|
|

Advertisement