Advertisement

  • దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమికి కారణాలు

దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమికి కారణాలు

By: chandrasekar Tue, 10 Nov 2020 8:38 PM

దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమికి కారణాలు


దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా బీజేపీ విజయం సాధించింది. టీఆర్ఎస్ ఓటమికి పలు కారణాలుగా విశ్లేషకులు చెపుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌పై బీజేపీ అనూహ్య విజయం తెలంగాణలో సరికొత్త సమీకరణాలకు దారి తీస్తుందని రాజకీయవర్గాల్లో అప్పుడే చర్చ మొదలైంది. 2018 సాధారణ ఎన్నికల్లో 60 వేలపైగా ఓట్ల మెజార్టీతో దుబ్బాకలో గెలిచిన టీఆర్ఎస్ ఇప్పుడు ఉప ఎన్నికల్లో అదే స్థానాన్ని అప్పుడు మూడో స్థానంలో ఉన్న బీజేపీకి కోల్పోయింది. సాధారణంగా ఉప ఎన్నికల్లో విజయం సాధించడంతో టీఆర్ఎస్ దిట్టగా గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి టీఆర్ఎస్ కేసీఆర్ సొంత జిల్లా, టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీశ్ రావు పర్యవేక్షించిన దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓడిపోవడం టీఆర్ఎస్ ఊహించని షాక్ అనే చెప్పాలి. అయితే అసలు దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు.

టీఆర్ఎస్ ఓటమికి కారణాలు పరిశీలిస్తే...

ఇక్కడ దుబ్బాక ఉప ఎన్నికల్లో తాము కచ్చితంగా గెలుస్తామని టీఆర్ఎస్ అతి విశ్వాసంతో వ్యవహరించిందనే వాదన ఉంది. తాము లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తామని బీజేపీ, కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా రావని ఆ పార్టీ నేతలు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఓ వైపు బీజేపీ శ్రేణులంతా దుబ్బాకలో తిష్ట వేసి ప్రచారం చేస్తే టీఆర్ఎస్ తరపున మాత్రం ఒక్క హరీశ్ రావు మాత్రం భారమంతా మోశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే ఆ కుటుంబానికి చెందిన వారికే సీటు ఇవ్వడం సాధారణంగా జరుగుతుంది. టీఆర్ఎస్ కూడా అదే చేసింది. అయితే సోలిపేట రామలింగారెడ్డి విషయంలో దుబ్బాక ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను టీఆర్ఎస్ పెద్దగా పట్టించుకోలేదనే టాక్ ఉంది. సోలిపేట రామలింగారెడ్డి కుమారుడిపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని భావించిన టీఆర్ఎస్ రామలింగారెడ్డి భార్య సుజాతకు టికెట్ ఇవ్వడం ద్వారా దానిని అధిగమించవచ్చని నిర్ణయించింది. కానీ టీఆర్ఎస్ అనుకున్నట్టు జరగలేదు. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పరాజయానికి, బీజేపీ విజయానికి మరో కారణం మల్లన్నసాగర్ ముంపు బాధితుల్లో ఉన్న అసంతృప్తి అనే ప్రచారం కూడా కొనసాగుతుంది. సిద్ధిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో ముంపు బాధితులకు ఇచ్చిన పరిహారంతో పోలిస్తే దుబ్బాకలో మల్లన్నసాగర్ ముంపు బాధితులకు ఇచ్చిన పరిహారం చాలా తక్కువ అనే భావన ఉంది.

ఈ విషయాలన్నీ బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించింది. పలు మండలాల్లో ఈ అంశంపై బీజేపీ బలంగా ప్రచారం చేయడం తమ పార్టీని గెలిపిస్తే న్యాయం చేస్తామని చెప్పడం కూడా ఆ పార్టీకి కలిసి వచ్చింది. దుబ్బాక నుంచి రెండు పర్యాయాలు ఓడిపోయిన రఘునందన్ రావు సోలిపేట మరణం తరువాత ఉప ఎన్నికలు ఖాయమనుకుని ముందుగానే రంగంలోకి దిగిపోయారు. తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. నియోజకవర్గంలోని యువతను దగ్గర చేసుకోవడంలో విజయం సాధించారు. స్వతహాగా మంచి వక్త అయిన రఘునందన్ రావు తనదైన ఉపన్యాసాలతో ప్రజలను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికలు జరిగే సమయానికి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో పాటు ఫ్లాట్లు ఉన్నవారంతా ఎల్‌ఆర్ఎస్ చేయించుకోవాలని ప్రభుత్వం నిబంధనల విధించింది. దీనిపై తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ ప్రభావం కూడా దుబ్బాక ఉప ఎన్నికల్లో పడిందనే వాదన ఉంది. మరోవైపు కరోనాను డీల్ చేసే విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా ఈ ఉప ఎన్నికలపై పడి ఉండొచ్చని పలువురు విశ్లేషిస్తున్నారు. వీటితో పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాల ప్రభావం కూడా ఈ ఎన్నికలపై పడిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలా పలు రకాలుగా టీఆర్ఎస్ పరాజయానికి కారణాలై ఉండవచ్చని విశ్లేషకులు చెపుతున్నారు.

Tags :
|

Advertisement