Advertisement

భారత్‌కు చేరుకున్న రాఫెల్ యుద్ధ విమానాలు

By: chandrasekar Wed, 29 July 2020 5:08 PM

భారత్‌కు చేరుకున్న రాఫెల్ యుద్ధ విమానాలు


రక్షణశాఖ అమ్ములపొదిలో చేరబోతోన్న బ్రహ్మాస్త్రంగా భావిస్తోన్న రాఫెల్ యుద్ధ విమానాలు భారత్‌కు చేరుకున్నాయి. ఏడు వేల కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించిన రాఫెల్ విమానాలు ఇవాళ భార‌త గ‌గ‌న‌త‌లంలోకి ప్రవేశించాయి. కొద్దిసేపటి కిందటే అవి హర్యానాలోని అంబాలా కంటోన్మెంట్ ప్రాంతంలో గల వైమానిక దళ ఎయిర్‌బేస్ స్టేషన్‌‌లో ల్యాండ్ అయ్యాయి. సోమవారం ఫ్రాన్స్‌ నుంచి బయలుదేరిన ఈ యుద్ధ విమానాలు ఈ మధ్యాహ్నం అంబాలాకు చేరుకున్నాయి. మార్గమధ్యలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కొద్దిసేపు విశ్రాంతి కోసం వాటిని ల్యాండ్ చేశారు.

రాఫెల్ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశంచిన వెంటనే ఐఎన్ఎస్ కోల్‌కత డెల్టా 63 వాటికి ఘన స్వాగతాన్ని పలికింది. అరేబియా సముద్రంలో మోహరించిన ఐఎన్ఎస్ కోల్‌కత డెల్టా నుంచి స్వాగత సందేశాన్ని రాఫెల్ యుద్ధ విమానాల కమాండర్‌కు పంపించారు. ఘన స్వాగతం పలుకుతున్నట్లు తెలిపారు. దీనికి ప్రతిగా రాఫెల్ కమాండర్ కృతజ్ఙతలు తెలిపారు. ఆ విమానాల రాక‌ భార‌త అస్త్ర‌శ‌క్తిని మ‌రింత పెంచింది. భార‌త గ‌గ‌న‌త‌లంలో ప్ర‌వేశిస్తున్న వేళ‌ రాఫెల్ గ‌ర్జ‌న‌లు మారుమోగాయి. ఫ్రాన్స్ నుంచి బ‌య‌లుదేరిన అయిదు రాఫెళ్లు భార‌త గ‌గ‌న‌త‌లంలోకి ఇవాళ మ‌ధ్యాహ్నం ప్ర‌వేశించాయి. ఆ స‌మ‌యంలో అద్భ‌త‌మైన ఘ‌ట్టం చోటుచేసుకున్న‌ది.

rafale jets,war,planes,arrived,indian air force ,భారత్‌కు, చేరుకున్న, రాఫెల్, యుద్ధ, విమానాలు


అయిదు రాఫెళ్ల‌కు రెండు సుఖోయ్‌లు అండ‌గా నిలుస్తూ స్వాగ‌తం ప‌లికాయి. ఆ దృశ్యం నీలాకాశంలో క‌నువిందు చేసింది. భార‌త గ‌గ‌న‌త‌లంలోకి ప్ర‌వేశిస్తున్న రాఫెల్ యుద్ధ విమానాల ఫోటోల‌ను ర‌క్ష‌ణ‌మంత్రి కార్యాల‌యం త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేసింది. రాఫెల్‌ ప‌క్షులు ఇండియ‌న్ ఎయిర్‌స్పేస్‌లోకి ఎంట‌ర్ అయిన‌ట్లు ట్వీట్‌లో తెలిపారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న రాఫెల్ యుద్ధ విమానాలకు అపూర్వ రీతిలో స్వాగతం పలకడానికి వైమానిక దళాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వాటికి వాటర్ క్యానన్లతో స్వాగతం పలకబోతున్నారు. దీనికోసం అగ్నిమాపక వాహనాలను సిద్ధం చేశారు. ల్యాండ్ అయిన వెంటనే వాటిపై నీళ్లను చల్లుతూ స్వాగతం పలుకుతారు. కొత్త ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అయిన సమయంలో వాటర్ క్యానన్లతో స్వాగతం పలకడం ఆనవాయితీగా వస్తోంది.

మొత్తం 36 రాఫెళ్ల‌కు ఒప్పందం కుదిరింది. అయితే తొలుత అయిదు రాఫెల్ విమానాల‌ను అప్ప‌గించారు. దీంట్లో 30 రాఫెల్ విమానాలు ఫైట‌ర్ జెట్స్ కాగా, మ‌రో ఆరు ట్రైనీ విమానాలు ఉండ‌నున్నాయి. 60 వేల కోట్ల‌తో రాఫెల్ డీల్ కుదుర్చుకున్నారు. 400 కోట్ల‌తో రాఫెల్ విమానాల మౌళిక స‌దుపాయాల కోసం ఖ‌ర్చు చేశారు. 17వ గోల్డెన్ యారో స్క్వాడ్ర‌న్‌లో ఈ విమానాలు ఉంటాయి. శౌర్య‌చ‌క్ర విజేత కెప్టెన్ హ‌రికీర‌త్ సింగ్ తొలి రాఫెల్‌ను ల్యాండ్ చేస్తారు. 2008లో మిగ్ విమానాన్ని అత్యంత చాక‌చ‌క్యంగా ల్యాండ్ చేయ‌డంలో కెప్టెన్ హ‌రికీర‌త్ కీల‌క పాత్ర పోషించాడు. మిగ్‌లో పేలుడు జ‌రిగినా కాక్‌పిట్ నుంచి చీక‌ట్లోనే యుద్ధ విమానాన్ని ల్యాండ్ చేశాడ‌త‌ను. ‌ల్యాండ్ అయిన తరువాత- అంబాలా ఎయిర్‌బేస్‌లో వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా వాటికి స్వాగతం పలికారు.

rafale jets,war,planes,arrived,indian air force ,భారత్‌కు, చేరుకున్న, రాఫెల్, యుద్ధ, విమానాలు


రాఫెల్ యుద్ధ విమానాలు మిస్సైళ్ల‌ను కూడా మోసుకెళ్తాయి. మెటిరో, స్కాల్ప్ లాంటి క్షిప‌ణ‌ల‌ను అవి ప్ర‌యోగించ‌గ‌ల‌వు. కంటికి క‌నిపించ‌ని దూరంలో ఉన్న టార్గెట్‌ను అవి చేధించ‌గ‌ల‌వు. మెటిరో మిస్సైళ్ల రేంజ్ 150 కిలోమీట‌ర్లు ఉంటుంది. స్కాల్ప్ మిస్సైల్ 300 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను ధ్వంసం చేస్తుంది. రాఫెల్ యుద్ధ విమానాల్లో టూ సీట‌ర్‌, సింగిల్ సీట‌ర్లు ఉన్నాయి. టూ సీట‌ర్‌ను రాఫెల్ డీహెచ్‌, సింగిల్ సీట‌ర్‌ను రాఫెల్ ఈహెచ్ అని పిలుస్తారు. రెండూ ట్విన్ ఇంజిన్ విమానాలే. ఇవి ఫోర్త్ జ‌న‌రేష‌న్ ఫైట‌ర్ విమానాలు. డెల్టా వింగ్‌, స్టీల్త్ సామ‌ర్థ్యం వీటికి ఉన్న‌ది. అణ్వాయుధ దాడిలోనూ ఈ యుద్ధ విమానాల‌ను వినియోగించే అవ‌కాశం ఉన్న‌ది.

రాఫెల్ విమానాల్లో సార్ రేడార్లు ఉంటాయి. సింథ‌టిక్ అప‌చ్యూర్ ర‌డార్ సాధార‌ణంగా జామ్ కాదు. లాంగ్ రేంజ్ టార్గెట్ల‌ను ఈ రేడార్ గుర్తిస్తుంది. రేడార్ జామ్ కాకుండే ఉండే స‌దుపాయాలు కూడా దీంట్లో ఉన్నాయి. రాఫెల్‌లో ఉన్న రేడార్‌ క‌నీసం 100 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న శ‌త్రు టార్గెట్‌ను గుర్తించ‌గ‌ల‌దు. ఈ యుద్ధ‌విమానాల్లో ఆధునిక 30ఎంఎం కెనాన్ ఆయుధాలు ఉంటాయి. అవి 125 రౌండ్ల కాల్పులు జ‌ర‌ప‌గ‌ల‌వు. ఈ విమానాలు ఒకేసారి ప‌ది ట‌న్నుల స‌ర‌కుల‌ను మోసుకెళ్ల‌గ‌ల‌వు. రాఫెల్ విమానాలు హ‌మ్మ‌ర్ అనే మీడియం రేంజ్ మిస్సైళ్ల‌ను కూడా ప్ర‌యోగిస్తాయి. ఆకాశం నుంచి నేల‌పై ఉన్న టార్గెట్‌ను స్ట్ర‌యిక్ చేస్తాయి. ల‌డ‌ఖ్ లాంటి ప‌ర్వ‌త ప్రాంతాల్లో ఉన్న బ‌ల‌మైన క‌ట్ట‌డాల‌ను, బంక‌ర్ల‌ను కూడా హ‌మ్మ‌ర్ మిస్సైల్ ధ్వంసం చేయ‌గ‌ల‌దు. ఈ విమానాలు మన రక్షణ దళంలో చేరికతో భారత్ మరింత బలోపేతమైంది.

Tags :
|
|

Advertisement