Advertisement

  • మైనర్ బాలికపై అత్యాచారం కేసు: అమీన్ పూర్ ఆశ్రమంలోనే నిందితుల రహస్య విచారణ

మైనర్ బాలికపై అత్యాచారం కేసు: అమీన్ పూర్ ఆశ్రమంలోనే నిందితుల రహస్య విచారణ

By: chandrasekar Mon, 17 Aug 2020 11:29 PM

మైనర్ బాలికపై అత్యాచారం కేసు: అమీన్ పూర్ ఆశ్రమంలోనే నిందితుల రహస్య విచారణ


సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ అనాధాశ్రమంలో మైనర్ బాలికకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసిన ఘటనకు సంబంధించి కేసు విచారణ బాధ్యతను ఉమెన్స్ సెక్యూరిటీ వింగ్ స్వాతి లక్రాకు అప్పగించారు. ఆశ్రమంలో బాలికకు మత్తుమందిచ్చి, ఏడాది కాలంగా అత్యాచారం చేస్తున్నారని మరణించే ముందు బాలిక ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నిందితుల అరెస్ట్ చేసిన పోలీసులు ఈ కేసులో రహస్య విచారణ కొనసాగిస్తున్నారు.మృతి చెందిన మైనర్ బాలిక మాత్రమే కాకుండా, మరో మైనర్ బాలికను కూడా లైంగిక వేధింపులకు గురి చేశారని తెలియడంతో, అసలు అనాధాశ్రమాలు ఏం జరుగుతుందన్న దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అమీన్ పూర్ లోని అనాధ ఆశ్రమానికి తరలించి అక్కడ రహస్య విచారణ కొనసాగిస్తున్నారు.

పటాన్ చెరువు డి.ఎస్.పి ఈ విచారణను కొనసాగిస్తున్నారు. పోలీసుల విచారణ, కస్టడీ వ్యవహారం బయటకు తెలియకుండా అత్యంత గోప్యంగా ఈ విచారణ కొనసాగుతోంది. ఆశ్రమానికి 200 మీటర్ల దూరం వరకు ఆంక్షలు విధించిన పోలీసులు, ఆశ్రమ పరిసర ప్రాంతాలను అధీనంలోకి తీసుకున్నారు.ఆశ్రమ నిర్వాహకులు, వార్డెన్, వారికి సహకరించిన వారిని ఆశ్రమంలోనే విచారణ చేస్తున్నారు. ఆశ్రమ నిర్వహణ పై కూడా పలు అనుమానాలు ఉన్న నేపథ్యంలో అన్ని కోణాల నుండి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ఈ అనాధాశ్రమం రంగారెడ్డి జిల్లా పరిధిలో రిజిస్ట్రేషన్ అయింది. ఆ తర్వాత ఆశ్రమ చిరునామాలను తరచూ మారుస్తూ వస్తున్నారు. ఆశ్రమాన్ని అమీన్ పూర్ కు మార్చిన తర్వాత అనుమతులు కూడా తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ ఆశ్రమ నిర్వహణ శైలిపై అనేక అనుమానాలున్నాయి.దీంతో నిందితులు వేణుగోపాల్ ను, విజయ, ఆమె సోదరుడు జైపాల్ ను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు.ఈ విచారణలో ఆశ్రమానికి సంబంధించిన మరిన్ని విషయాలు బయట పడే అవకాశం ఉంది.

ఈ కేసు విచారణకు తెలంగాణ ప్రభుత్వం హై పవర్ కమిటీని ఏర్పాటు చేయడంతో మృతి చెందిన బాలిక తరపు బాధిత కుటుంబం కమిటీ ముందు హాజరై ఇప్పటికే వాంగ్మూలం ఇచ్చింది. ఫోక్సో చట్టం కింద కేసు పెట్టిన వెంటనే అరెస్ట్ చెయ్యాల్సింది పోయి అధికారులు ఆలస్యం చేశారంటూ బాధిత కుటుంబం ఆరోపిస్తోంది . ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేయాలని దోషులకు శిక్ష పడేలా చూడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Tags :

Advertisement