Advertisement

  • భారత జాతీయ జెండాలు మాత్రమే కశ్మీర్‌లో రెపరెపలాడుతున్నాయన్న రాజ్‌నాథ్

భారత జాతీయ జెండాలు మాత్రమే కశ్మీర్‌లో రెపరెపలాడుతున్నాయన్న రాజ్‌నాథ్

By: chandrasekar Mon, 15 June 2020 11:31 AM

భారత జాతీయ జెండాలు మాత్రమే కశ్మీర్‌లో రెపరెపలాడుతున్నాయన్న రాజ్‌నాథ్


ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో జమ్మూ కశ్మీర్ గతంలో ఎన్నడూ లేని గొప్ప అభివృద్ధి చూడనుందని, పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు సైతం తమను భారత్‌లో విలీనం చేయాలనే రోజు త్వరలోనే వస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఆదివారం జమ్మూ కశ్మీర్ జన సంవాద్ ర్యాలీ లో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజ్‌నాథ్ మాట్లాడారు. పీఓకే ప్రజలు కూడా భారత్‌తో కలిసుంటామని డిమాండ్ చేసే రోజు త్వరలోనే వస్తుందని, కొంచెం వేచిచూడాలని అన్నారు. ఇది జరిగిన రోజు పార్లమెంట్ లక్ష్యం కూడా నెరవేరుతుందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. గతంలో స్వాతంత్ర కశ్మీర్ డిమాండ్‌తో పాకిస్థాన్, ఐఎస్ జెండాలను ప్రజలు పట్టుకునేవారని, ప్రస్తుతం పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చిందన్నారు.

భారత జాతీయ జెండాలు మాత్రమే కశ్మీర్‌లో రెపరెపలాడుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడి రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ జన సంవాద ర్యాలీలో జమ్మూ కశ్మీర్‌కు చెందిన బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశ ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని రాజ్‌నాథ్ పునరుద్ఘాటించారు. చైనాతో సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. భారత్‌ ఇక ఏమాత్రం బలహీన దేశం కాదని, గత కొన్నేళ్లలో దేశ రక్షణ వ్యవస్థ అత్యంత పటిష్ఠంగా రూపుదిద్దుకుందని వివరించారు.

భారతదేశ బలాన్ని దేశాన్ని రక్షించడం కోసమే ఉపయోగిస్తామని ఏ దేశాన్నీ భయపెట్టే దురుద్దేశం తమకు లేదంటూ పరోక్షంగా సరిహద్దుల్లో ఇటీవల చైనాతో ఏర్పడ్డ వివాదాన్ని ప్రస్తావించారు. అలాగే, పొరుగు దేశాలతో వివాదాలను దాచి పెట్టేదే లేదని సరైన సమయంలో పార్లమెంటు ముందు అన్ని వివరాలను ఉంచుతామని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు చైనా సంసిద్ధత వ్యక్తం చేసిందని రాజ్‌నాథ్‌ తెలిపారు. దానికి భారత్‌ కూడా సుముఖంగానే ఉందన్నారు.

Tags :
|
|

Advertisement