Advertisement

  • పంజాబ్ పై అలవోకగా నెగ్గిన రాజస్థాన్ ప్లే ఆఫ్ కు పోటీపడనున్నది

పంజాబ్ పై అలవోకగా నెగ్గిన రాజస్థాన్ ప్లే ఆఫ్ కు పోటీపడనున్నది

By: chandrasekar Sat, 31 Oct 2020 09:19 AM

పంజాబ్ పై అలవోకగా నెగ్గిన రాజస్థాన్ ప్లే ఆఫ్ కు పోటీపడనున్నది


పంజాబ్ పై రాజస్థాన్ అలవోకగా నెగ్గి ప్లే ఆఫ్ కు పోటీపడనున్నది. ఐపిఎల్ 2020లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌‌పై రాజస్థాన్‌ రాయల్స్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కి వచ్చిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 185 పరుగులు చేసింది. అనంతరం 186 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ దూకుడుగా ఆడి 3 వికెట్లు కోల్పోయి మరో 15 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ ఈ విజయంతో ప్లే ఆఫ్స్‌పై ఆశలు సజీవం చేసుకుంది. బెన్‌స్టోక్స్‌ (50 పరుగులు: 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సంజు శాంసన్‌ (48 పరుగులు: 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి జట్టుకు విజయం అందించారు. రాబిన్‌ ఉతప్ప (30), స్టీవ్‌ స్మిత్‌ (31 నాటౌట్‌), జోస్‌ బట్లర్‌ (22 నాటౌట్‌) సమష్టి కృషితో రాజస్థాన్ రాయల్స్ సునాయసంగానే గెలుపొందింది. పంజాబ్‌ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, మొహమ్మద్ షమి, మురుగన్ అశ్విన్, క్రిస్ జోర్డన్ ధారళంగా పరుగులు సమర్పించుకోగా రవి బిష్ణోయ్ మాత్రమే 4 ఓవర్లు వేసి 27 పరుగులు మాత్రమే ఇచ్చుకున్నాడు. మురుగన్‌ అశ్విన్‌, జోర్డాన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

రాజస్థాన్ పై పంజాబ్ బౌలర్ లు కట్టడి చేయలేక పోయారు. పంజాబ్ బ్యాట్స్‌మెన్‌లో క్రిస్‌గేల్‌ (99 పరుగులు: 63 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లు) చెలరేగిపోయి కొద్దిలో సెంచరీ మిస్ అయ్యాడు. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (46 పరుగులు: 41 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా, నికోలస్‌ పూరన్‌ (22 పరుగులు: 10 బంతుల్లో 3 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు. రాజస్థాన్ బౌలర్లలో బెన్‌స్టోక్స్, జోఫ్రా ఆర్చర్‌ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్ లో అటు బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్‌లోనూ మెరిసిన బెన్ స్టోక్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్నాడు. ఈ ఓటమితో వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచిన పంజాబ్ జట్టు దూకుడుకు బ్రేకులేసినట్టయింది. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు నెట్ రన్ రేట్‌తో 14 పాయింట్స్‌‌తో కొనసాగుతుండగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు 12 పాయింట్స్‌తో సమ స్థాయిలో కొనసాగుతున్నాయి. దీంతో ఇకపై జరగనున్న మ్యాచ్‌ల్లో జట్లకు భారీ విజయాలు అవసరం కానున్నాయి.

Tags :

Advertisement