Advertisement

  • తెలంగాణాలో రికార్డు స్థాయిలో వర్షాలు ...ఉమ్మడి మహబూబ్ నగర్ టాప్

తెలంగాణాలో రికార్డు స్థాయిలో వర్షాలు ...ఉమ్మడి మహబూబ్ నగర్ టాప్

By: Sankar Tue, 29 Sept 2020 07:00 AM

తెలంగాణాలో రికార్డు స్థాయిలో వర్షాలు ...ఉమ్మడి మహబూబ్ నగర్ టాప్


తెలంగాణాలో ఈ ఏడాది వర్షాలు జోరుగా కురిసాయి..ఎంతలా అంటే పదేళ్ల అనంతరం కొత్త రికార్డు నెలకొల్పింది..నైరుతి రుతుపవనాలు, అల్పపీడనాలకు తోడు కొత్తగా ఏర్పడ్డ షీర్‌జోన్‌తో కురిసిన కుంభవృష్టి తెలంగాణను నిండు కుం డలా మార్చేసింది. జూన్‌ మొదటి వారంలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాల ఉపసంహరణ సోమవారం నుంచి మొదలైంది.

ఈ నాలుగు మాసాల్లో ఏకంగా 16 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదవ్వగా.. 11 జిల్లాల్లో అధిక వర్షపాతం, 6 జిల్లాల్లో సాధారణ వర్షపాతం రికార్డయింది. వాస్తవానికి నాలుగు మాసాల్లో 711.7 మి.మీ.ల సగటు వర్షం కురువాల్సి ఉండగా ఏకంగా 1,071 మి.మీ.ల వర్షం కురిసింది. ఇది సాధారణ సగటుతో పోలిస్తే దాదాపు 50 శాతం అధికం.. ఇంత భారీ ఎత్తున వర్షాలు గడిచిన పదేళ్లలో 2010లో సాధారణ సగటు కంటే 32 శాతం అధికంగా నమోదు కాగా ఈ మారు ఆ రికార్డు చెరిగిపోయింది.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో రికార్డు వర్షాలు నమోదయ్యాయి. వనపర్తి జిల్లాలో 150 శాతం, నారాయణపేటలో 140, గద్వాలలో 130 శాతం వర్షాలు కురిశాయి. రాష్ట్రమంతా భారీ వర్షపాతం నమోదైనా.. ఆదిలాబాద్, నిర్మల్‌ జిల్లాల్లో కురువాల్సిన సాధారణ వర్షం కంటే కాస్త తక్కువగా నమోదు కావటం గమనార్హం. నిర్మల్‌లో 944.9 మి.మీ.కి 819 మి.మీలు, ఆదిలాబాద్‌లో 995.4 మి.మీకి గానూ 908.1 మి.మీ. కురిసింది.

ఈ సీజన్‌ ప్రారంభం నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో సగం రోజులు (రెయినీ డేస్‌) వర్షాలు కురిశాయి. అత్యధికంగా కామారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో జూలైలో 23 రోజులు, ఆగస్టులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 25, ములుగులో 24, మహబూబాబాద్‌లో 23, ఆగస్టులో రంగారెడ్డిలో 18, ఆదిలాబాద్‌లో 17 రోజులు వర్షాలు కురిశాయి. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు ఏర్పడ్డ 9 అల్పపీడనాల వల్ల కూడా భారీగా వర్షం నమోదైంది

Tags :

Advertisement