Advertisement

  • ఢిల్లీ క్యాపిటల్స్‌పై 5 వికెట్ల తేడాతో పంజాబ్‌ విజయం...ప్లేఆఫ్ రేసులో

ఢిల్లీ క్యాపిటల్స్‌పై 5 వికెట్ల తేడాతో పంజాబ్‌ విజయం...ప్లేఆఫ్ రేసులో

By: chandrasekar Wed, 21 Oct 2020 3:37 PM

ఢిల్లీ క్యాపిటల్స్‌పై 5 వికెట్ల తేడాతో పంజాబ్‌ విజయం...ప్లేఆఫ్ రేసులో


ఐపీఎల్‌-13లో ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ అద్భుతంగా ఆడింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 5 వికెట్ల తేడాతో పంజాబ్‌ విజయం సాధించింది. 165 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్‌ మరో 6 బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఢిల్లీ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ అద్భుత శతకం వృథా అయింది. లక్ష్య ఛేదన ఆరంభంలో యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌గేల్‌(29: 13 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు) ఆ తర్వాత పూరన్‌(53: 28 బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సర్లు) అర్ధశతకంతో రాణించడంతో పంజాబ్‌ అలవోకగా గెలిచింది. వీరిద్దరూ భారీ సిక్సర్లతో విరుచుకుపడటంతో సాధించాల్సిన రన్‌రేట్‌ వేగంగా తగ్గిపోయింది. దీంతో ఆఖర్లో వచ్చిన బ్యాట్స్‌మెన్‌ నిలకడగా ఆడుతూ లక్ష్యం దిశగా సాగారు. మధ్య ఓవర్లలో మాక్స్‌వెల్‌(32: 24 బంతుల్లో 3ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

తుషార్‌ దేశ్‌పాండే రెండు ఓవర్లు వేసి 41 పరుగులు సమర్పించుకున్నాడు. దేశ్‌పాండే వేసిన ఐదో ఓవర్‌లో గేల్‌ ఒక్కడే మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది ఇన్నింగ్స్‌కు ఊపుతీసుకొచ్చాడు. ఆ ఓవర్‌లో గేల్‌ వీరవిహారం చేయడంతో 26 పరుగులు వచ్చాయి. మళ్లీ తుషార్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌లో పూరన్‌ వరుసగా సిక్స్‌, రెండు ఫోర్లు బాది 15 పరుగులు సాధించాడు. మాక్స్‌వెల్‌ సహకారం అందిస్తుండగా ఈ క్రమంలోనే ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన పూరన్‌ 27 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. రబాడ వేసిన 13వ ఓవర్లో అనూహ్యంగా బంతి గ్లోవ్స్‌కు తాకి వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో మాక్స్‌వెల్‌ జట్టును ముందుండి నడిపించాడు. మళ్లీ రబాడ బౌలింగ్‌లోనే మాక్స్‌వెల్‌ భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. సాధించాల్సిన రన్‌రేట్‌ తక్కువగా ఉండటంతో దీపక్‌ హుడా(15 నాటౌట్‌), జేమ్స్‌ నీషమ్‌(10) జట్టుకు విజయాన్ని అందించారు. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(15), అగర్వాల్‌(5) విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో రబాడ రెండు వికెట్లు తీయగా అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌ చెరో వికెట్‌ తీశారు.

మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. పంజాబ్‌ బౌలర్లలో మహ్మద్‌ షమీ రెండు వికెట్లు తీయగా మాక్స్‌వెల్‌, నీషమ్‌, మురుగన్‌ అశ్విన్‌ తలో వికెట్‌ తీశారు. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ‌(106నాటౌట్‌: 61 బంతుల్లో 12ఫోర్లు, 3సిక్సర్లు) మరో అద్భుత ప్రదర్శన చేశాడు. ధావన్‌కు శ్రేయస్‌ అయ్యర్‌(14), రిషబ్‌ పంత్‌(14) కాస్త సహకారం అందించారు.

Tags :
|

Advertisement