Advertisement

  • ఆస్తుల వివరాల నమోదు గడువు పదిరోజులు పెంచిన తెలంగాణ ప్రభుత్వం

ఆస్తుల వివరాల నమోదు గడువు పదిరోజులు పెంచిన తెలంగాణ ప్రభుత్వం

By: Sankar Sun, 11 Oct 2020 08:13 AM

ఆస్తుల వివరాల నమోదు గడువు పదిరోజులు పెంచిన తెలంగాణ ప్రభుత్వం


వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ గడువును ఈ నెల 20 వరకు పొడిగించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. శనివారంతో గడువు ముగిసిపోగా మరో 10 రోజులు పొడిగిం చింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)కు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ చట్టానికి ప్రతిపాదించిన పలు కీలక సవరణలను మంత్రివర్గం ఆమోదిం చింది.

జీహెచ్‌ఎంసీ పాలకమండలిలో మహిళలకు 50 శాతం ప్రాతినిధ్యానికి చట్టబద్ధత కల్పించడంతో పాటు డివిజన్‌ కమిటీల పనివిధానం, డివిజన్ల రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు ఇందులో ఉన్నాయని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. మహిళా రిజర్వేషన్లకు సంబంధించి కేంద్రం చేసిన రాజ్యాంగ సవరణకు అనుగుణంగా జీహెచ్‌ఎంసీలో ఇప్పటికే అమలులో ఉన్న 50 శాతం మహిళల కోటాకు చట్టబద్ధత కల్పించాలనే ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించింది.

అలాగే జీహెచ్‌ఎంసీలో ప్రస్తుతం ప్రతి ఐదేళ్లకోసారి డివిజన్ల రిజర్వేషన్లు రొటేషన్‌ పద్ధతితో మారుతున్నాయి. ఇకమీదట రెండు పర్యాయాలకు (పదేళ్లకు) ఒకసారి డివిజన్ల రిజర్వేషన్లు మారుతాయి.జీహెచ్‌ఎంసీకి సంబంధించిన ఈ రెండు అంశాలతో పాటు ఇతర బిల్లులను మంగళ, బుధవారాల్లో జరిగే శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం ఆమోదింపచేసుకోనుంది. వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమిగా మార్చేక్రమంలో సంబంధిత అధికారి విచక్షణాధికారం దుర్వినియోగం కాకుండా చూసేందుకు కొత్త రెవెన్యూ చట్టంలో ప్రత్యేక నిబంధనలను ప్రభుత్వం పొందుపర్చింది.

భూవినియోగ మార్పిడి కోసం ధరణి పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పించడానికి నాలా చట్టానికి సవరణలు జరపాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ఇటీవల తీసుకొచ్చిన కొత్త రిజిస్ట్రేషన్‌ చట్టానికి స్వల్ప మార్పులతో సవరణలను జరపాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన శనివారం ప్రగతిభవన్‌లో సమావేశమైన రాష్ట్రమంత్రివర్గం ఈ మేరకు పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. హెచ్‌ఎండీఎ పరిధిలో ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ విధానంపై మంత్రివర్గం చర్చించింది.

Tags :
|

Advertisement