Advertisement

పృథ్వీ -2 క్షిపణి రాత్రివేళ ప్రయోగం విజయవంతం

By: Sankar Fri, 16 Oct 2020 9:44 PM

పృథ్వీ -2 క్షిపణి రాత్రివేళ ప్రయోగం విజయవంతం

పృథ్వీ-2 క్షిపణి ప్రయోగ పరీక్ష మరోసారి విజయవంతమైంది. అణ్వాయుధాలు మోసుకెళ్లే సామర్థ్యమున్న ఈ క్షిపణిని శుక్రవారం మరోసారి రాత్రి వేళ ప్రయోగంలో భాగంగా ఒడిశా తీరంలో బాలసోర్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి పరీక్షించారు.

స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్‌లో ఇప్పటికే భాగమైన ఈ క్షిపణి పరీక్షను మరోసారి విజయవంతంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ద్రవ ఇంధనంతో నడిచే పృథ్వీ -2 క్షిపణి 250 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఒక టన్ను బరువుగల వార్‌హెడ్‌ను మోయగలదు. దేశీయంగా తయారు చేసిన ఉపరితలం నుంచి ఉపరితలం లక్ష్యాలను ఛేదించగల తొలి వ్యూహాత్మక క్షిపణి ఇది.

మరోవైపు పృథ్వీ -2 క్షిపణిని రాత్రి వేళలో పరీక్షించడంతో మూడు వారాల్లో ఇది రెండోసారి. సెప్టెంబర్‌ 27న డీఆర్డీవో చాలా రహస్యంగా ఈ అణు క్షిపణి మరో రౌండ్ నైట్ ట్రయల్ నిర్వహించింది. కాగా డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఉపరితలం నుండి ఉపరితల లక్ష్యాలను ఛేదించే క్షిపణులను 40 రోజుల్లో ఇప్పటి వరకు 11 సార్లు పరీక్షించారు.

వీటిలో అన్ని విజయవంతం కాగా ఒక్క నిర్భయ్‌ క్రూయిజ్ క్షిపణి మాత్రమే చివరి నిమిషంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయింది. ఈ తరుణంలో శుక్రవారం రాత్రి వేళ నిర్వహించిన యూజర్ ట్రయల్స్‌లో పృథ్వీ -2 క్షిపణి అన్ని పరిమితులను చేరుకున్నదని, నైట్‌ ట్రయల్‌ విజయవంతమైందని డీఆర్డీవో అధికారులు తెలిపారు.

Tags :
|

Advertisement