Advertisement

  • శ్రీశైల విరాళాల కేంద్రంపై అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక దృష్టి

శ్రీశైల విరాళాల కేంద్రంపై అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక దృష్టి

By: chandrasekar Sat, 27 June 2020 1:19 PM

శ్రీశైల విరాళాల కేంద్రంపై అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక దృష్టి


శ్రీశైల మల్లికార్జున స్వామి అమ్మవార్లకు చెందాల్సిన సొమ్మును దోచుకోవడానికి కేంద్ర స్థానమైన విరాళాల కేంద్రంపై అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడ క్షేత్ర స్థాయి నుంచి కూపీ లాగుతున్నారు. శుక్రవారం ఏసీబీ జేడీ గంగాధర్ రావు ఆధ్యర్యంలో ఐదుగురు సభ్యుల బృందం దేవస్థానం పరిపాలన విభాగానికి సంబంధించిన పలువురిని విచారించింది. విరాళాల కేంద్రానికి ఆకస్మికంగా చేరుకుని క్షుణ్నంగా తనిఖీ చేశారు. ఇక్కడ పలు కీలక దస్త్రాలను స్వాధీనపరుచుకొన్నట్టు తెలిసింది.

అనినీతికి కారణమైన ప్రధాన వ్యక్తులతోపాటు అందుకు సహకరించిన సిస్టమ్ అడ్మిన్లు, సూపరింటెండెంట్లు, ఏఈఓలను కూడా ప్రత్యేక విచారణలో భాగస్తులను చేస్తున్నారు. దేవస్థానం టెండరు ద్వారా ఇచ్చిన సర్వర్ మెయింటేనెన్స్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్లు అందుకు భాద్యులుగా గల నిర్వాహకులు, టీఎంఎస్ సర్వీసెస్ వారిని కూడా విచారించనున్నట్లు తెలిసింది.

అవినీతి కుంభకోణంపై విచారణ జరుగుతున్న క్రమంలో మరికొందరు అధికారుల పేర్లు కూడా సిబ్బంది చర్చించుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. సైబర్ నేరానికి పాల్పడిన దేవస్థానం అధికారులు సిబ్బందిపై కేసులు నమోదు చేసిన ప్రత్యేక విచారణ అధికారి ఆత్మకూరు డీఎస్పీ వెంకట్రావు ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలకు అనుగుణంగా అన్ని విభాగాల్లో మరింత లోతుగా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు పలువురు దాతలు ఇచ్చిన లక్షల రూపాయలను దేవస్థానం అధికారులు, సిబ్బంది కలిసి దోచుకుతిన్నారు. శుక్రవారం సాయంత్రం ఊరంతా తిరుగుతూ శ్రీశైలంలోని వివిధ నిత్యాన్న సత్రాలతోపాటు టోల్గేట్, అన్నదాన విరాళకేంద్రం, పెట్రోల్ బంక్, అకామిడేషన్ విభాగంలోని దస్త్రాలను స్వాధీనపరుచుకున్నట్టు తెలిసింది.

ప్రధానంగా బలిజ సత్రం పేరుతో నకిలీ ఐడీ పాస్వర్డు సృష్టించి అధిక మోత్తంలో నగదు ఖాజేసిన సిస్టమ్ అడ్మిన్ల నిర్వాహకం గత విచారణలో తేలడంతో మిగతా ప్రధాన సత్రాలైన వాసవి, కమ్మ సత్రాలలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి సిబ్బందిని విచారించారు. ఏసీబీ అధికారులు రికార్డుల్లో నమోదైన అంశాలకు సాఫ్ట్ వేర్ బ్యాకప్ లో ఉన్న రశీదులను పోల్చడంతో కేసు దర్యాప్తులో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం దేవస్థానంలో పని చేస్తున్న సిస్టమ్ అడ్మిన్లను వెంటబెట్టుకుని ఏసీబీ అధికారులు వివిధ విభాగాలకు ఆకస్మికంగా వెళ్తుండటం పలువురికి భయం వేస్తున్నది.

Tags :

Advertisement