Advertisement

  • స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సంయమనంతో జరుపుకొంటున్నామన్న రాష్ట్రపతి రామ్‌నాథ్

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సంయమనంతో జరుపుకొంటున్నామన్న రాష్ట్రపతి రామ్‌నాథ్

By: chandrasekar Sat, 15 Aug 2020 10:42 AM

స్వాతంత్ర  దినోత్సవ వేడుకలు సంయమనంతో జరుపుకొంటున్నామన్న రాష్ట్రపతి రామ్‌నాథ్


స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో 74 వ స్వాతంత్ర దినోత్సవం ఆగష్టు 15 న జరుపుకుంటుంది. కరోనా విజృంభణతో ప్రజల జీవన స్థితిగతులే మారిపోయాయని రాష్ట్రపతి అన్నారు. ఈ వైరస్‌ పేద ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాతో నెలకొన్న కష్టకాలంలో కేంద్రం అనేక పథకాల ద్వారా సాయం చేసిందని తెలిపారు. కరోనా మహమ్మారితో ప్రపంచమంతా పోరాడుతోందని ఆయన అన్నారు. కోవిడ్ కారణంగా తలెత్తే సవాళ్లను కేంద్ర ప్రభుత్వం ముందుగానే గుర్తించి సమర్ధవంతంగా ఎదుర్కొందని ప్రశంసించారు. సకాలంలో తీసుకున్న సమర్ధవంతమైన చర్యల వల్ల కోవిడ్ తీవ్రతను నిరోధించడం, పెద్ద సంఖ్యలో ప్రజల విలువైన ప్రాణాలను కాపాడటంలో భారత్ విజయవంతమైందని అన్నారు.

దేశ ప్రజలను ఉద్దేశించి శుక్రవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రసంగించారు. ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కొంత సంయమనంతో జరుపుకొంటున్నామని చెప్పారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కోవిడ్ నిరోధక చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్రను సైతం రాష్ట్రపతి ప్రశంసించారు. భారతదేశం వంటి అత్యధిక జనాభా కలిగిన దేశంలో కలిసికట్టుగా మానవ ప్రయత్నం చేసినప్పడే మంచి ఫలితాలు వస్తాయని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అన్ని రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకున్నాయని చెప్పారు. వందే భారత్ మిషన్ కింద విదేశాల్లో చిక్కుకున్న 10 లక్షల మందికి పైగా పౌరులను స్వదేశానికి ప్రభుత్వం తీసుకు వచ్చిందని, ఇండియన్ రైల్వేలు అవసరానికి అనుగుణంగా రైళ్లు నడిపాయని, ఎన్నో సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని రాష్ట్రపతి అన్నారు.

ప్రజల సంపూర్ణ సహకారం, సమష్టి ప్రయత్నాలతో కోవిడ్ మహమ్మారి తీవ్రతను నిరోధించగలిగామని, పెద్దఎత్తున ప్రజల ప్రాణాలను కాపాడుకోగలిగామని అన్నారు. యావత్ ప్రపంచం ప్రాణాంతక వైరస్‌‌ ముంగిట ఉంది. అన్ని కార్యక్రమాలు నిలిచిపోయాయి. భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరిగింది' అని ఆయన అన్నారు. కరోనా మహమ్మారి పోరాటంలో అవిశ్రాంతంగా పనిచేసిన వైద్యులు, నర్సులు, ఇతర హెల్త్ వర్కర్లకు దేశమంతా రుణపడి ఉందన్నారు. దురదృష్టవశాత్తూ వీరిలో కొందరు ప్రాణాలు కోల్పోయారని, వారే నిజమైన దేశ హీరోలను ప్రశంసించారు.

దేశంలోని కరోనా వారియర్లంతా అత్యంత గౌరవం అందుకోవడానికి అర్హులని అన్నారు. ప్రకృతి వైపరీత్యాల నిరోధక బృందాలు, పోలీసు సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, డెలివరీ సిబ్బంది, ట్రాన్స్‌పోర్టేషన్, రైల్వే, విమానయాన సిబ్బంది, వివిధ సర్వీసుల ప్రొవైడర్లు, ఔదార్యం కలిగిన పౌరులు అందరూ స్ఫూర్తిదాయకంగా నిలిచారని అన్నారు. రాష్ట్రపతి తన ప్రసంగంలో పరోక్షంగా చైనా విస్తరణ వాదాన్ని ఎండగట్టారు. యావత్ ప్రపంచం తమ ముందున్న అతిపెద్ద సవాలును (కోవిడ్ మహమ్మారి) ఎదుర్కొంటుండగా, మరో వైపు మన పొరుగుదేశం విస్తరణవాదంతో దుస్సాహసం చేస్తోందని రామ్‌నాథ్ కోవింద్ అన్నారు.

Tags :

Advertisement