Advertisement

  • టపాసుల షాపులు వెంటనే మూసి వేయాలి... ప్రభుత్వం ఆదేశాలు జారీ...

టపాసుల షాపులు వెంటనే మూసి వేయాలి... ప్రభుత్వం ఆదేశాలు జారీ...

By: chandrasekar Fri, 13 Nov 2020 4:26 PM

టపాసుల షాపులు వెంటనే మూసి వేయాలి... ప్రభుత్వం ఆదేశాలు జారీ...


తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలో బాణాసంచా కాల్చడంపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో టపాసుల అమ్మకాలు, వాడకాన్ని నిషేధించాల‌ని హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు టపాసుల దుకాణాలు వెంటనే మూసివేయాల‌ని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేర‌కు త‌గిన చ‌ర్యలు తీసుకోవాల‌ని డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి, అన్ని జిల్లాల క‌లెక్టర్లు, ఎస్పీలు, సీపీల‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సామాజిక కోణంలో చూస్తే పండుగలు చాలా ముఖ్యమైనవని.. కానీ ప్రజల ప్రాణాలు అంతకంటే ప్రధానం కాదని హైకోర్టు ధర్మాసనం గురువారం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పటాకులపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ జరిపింది.

పిటిషనర్‌ వాదనలు వినిపిస్తూ టపాసులు కాల్చడం వల్ల ఏర్పడే కాలుష్యం, పొగ కరోనా వైరస్‌ రోగుల ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతున్నదని తెలిపారు. వీటిని కాల్చడం వల్ల గాలి నాణ్యత తగ్గి శ్వాసకోశ వ్యాధులున్న రోగులు, కరోనా‌ బాధితులు ఇబ్బందులు పడతారని ధర్మాసనానికి వివరించారు. ఈ విషయాలు దృష్టిలో ఉంచుకొని రాజస్థాన్‌ సహా కొన్ని రాష్ట్రాల్లో బాణాసంచా అమ్మకాలు, వినియోగాన్ని బ్యాన్ చేశారని పిటిషనర్ కోర్టుకు వివరించారు. ఇప్పటికే పలు హైకోర్టులు కూడా నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీచేశాయని గుర్తుచేశారు. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత, అందుకోసం సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హైకోర్టు పేర్కొంది. ఇప్పటికే తెరిచిన దుకాణాలను మూసేయాలని స్పష్టం చేసింది. ప్రజలు పటాకులు కాల్చకుండా ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాల ద్వారా ప్రభుత్వం అవగాహన కల్పించాలని తెలిపింది.

Tags :

Advertisement