Advertisement

జోరుగా సాగుతున్న అమెరికా అధ్యక్షుడి పోలింగ్

By: chandrasekar Wed, 04 Nov 2020 2:56 PM

జోరుగా సాగుతున్న అమెరికా అధ్యక్షుడి పోలింగ్


వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిని ఎన్నుకొనేందుకు ఆ దేశ ప్రజలు మంగళవారం ఓటు వేశారు. కరోనా భయాలను లెక్కచేయకుండా చాలా రాష్ట్రాల్లో మంగళవారం ఉదయం 6 గంటల నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు వందల సంఖ్యలో లైన్లు కట్టారు. రాత్రి 9 గంటల ( భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 7 గంటల వరకు) వరకు పోలింగ్‌ జరుగుతుంది. ఈసారి భారీగా మెయిల్‌ ఇన్‌ ఓట్లు నమోదవటంతో ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నది. ఎన్నికలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రజలందరూ ఓటింగ్‌లో పాల్గొనాలని రిపబ్లికన్‌, డెమోక్రాటిక్‌ అభ్యర్థులు డొనాల్డ్‌ ట్రంప్‌, జో బిడెన్‌ పిలుపునిచ్చారు. కాగా న్యూహ్యాంప్‌షైర్‌లో తొలి ఫలితం ప్రకటించారు. ఇక్కడ 10 ఎలక్టోరల్‌ ఓట్లు బిడెన్‌ గెలుచుకోగా, 16 ఓట్లు ట్రంప్‌ ఖాతాలోకి వెళ్లాయి.

అమెరికాలో మూడు టైమ్‌ జోన్లు ఉండటంతో పోలింగ్‌ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సమయంలో ప్రారంభమైంది. తూర్పుతీర రాష్ట్రాలైన వర్జీనియా, న్యూయార్క్‌, న్యూజెర్సీ, మెయినెల్లో ఉదయం 6 గంటలకే పోలింగ్‌ మొదలు కాగా, కాలిఫోర్నియాలో 7 గంటలకు ప్రారంభమైంది. అధ్యక్షుడిని నిర్ణయించే రాష్ట్రాలుగా పేరు పొందిన పెన్సిల్వేనియా, విస్కాన్సిస్‌, జార్జియా, ఉత్తర కరోలినా, అరిజోనా తదితర రాష్ట్రాల్లో తెలతెలవారుతూనే వందల మంది ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. కరోనా నేపథ్యంలో ఓటింగ్‌ విధానాల్లో మార్పులు తేవటంతో పోలింగ్‌ తేదీకంటే ముందే దాదాపు 10 కోట్ల మంది డ్రాప్‌ బాక్స్‌, మెయిల్‌ ఇన్‌ విధానాలతో ఓట్లు వేశారు. మంగళవారం మరో 6 నుంచి 7 కోట్ల మంది ప్రత్యక్ష విధానంలో ఓటు వేసినట్టు తెలుస్తున్నది. మధ్యాహ్నానికే ఫ్లోరిడాలో 91 లక్షల మంది ఓటు వేశారు. 2016 ఎన్నికల్లో నమోదైన మొత్తం ఓట్లలో ఇవి 95 శాతం. అమెరికాలో 23.9 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. కరోనా నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకుంటారో లేదోనన్న భయంతో అధ్యక్ష అభ్యర్థులు ట్రంప్‌, బిడెన్‌ సోషల్‌ మీడియా ద్వారా ప్రజలను ఓటు వేసేలా ప్రోత్సహించారు. మంగళవారం ఉదయం ‘ఓట్‌.. ఓట్‌.. ఓట్‌..’ అంటూ అధ్యక్షుడు ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. అధ్యక్ష భవనం వైట్‌ హౌస్‌లోనే ఉండి దేశవ్యాప్తంగా పోలింగ్‌ సరళిని పరిశీలించారు. ‘ఇది ఎన్నికల రోజు. అమెరికా.. వెళ్లి ఓటు వెయ్యి’ అని బిడెన్‌ ట్వీట్‌ చేశారు. డెమోక్రాటిక్‌ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్‌ కూడా ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈసారి అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెంటనే వెల్లడయ్యే అవకాశాలు కనిపించటంలేదు. మెయిల్‌ ఇన్‌ ఓట్లే పది కోట్ల వరకు ఉండటంతో వాటిని లెక్కించేందుకు వారం సమయం పట్టే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. మంగళవారం వరకు కూడా చాలా రాష్ట్రాల్లో మెయిల్‌ ఇన్‌ ఓట్ల లెక్కింపు మొదలు కాలేదు. కొన్నిరాష్ట్రాల్లో ఇప్పటికీ ఎన్నికల అధికారులకు ఈ ఓట్లు చేరుతూనే ఉన్నాయి. దాంతో ఓట్ల లెక్కింపు కష్ట౦గా మారింది. కరోనా నేపథ్యంలో పోలింగ్‌ తేదీన పోలింగ్‌ కేంద్రాల వద్ద రద్దీని నివారించేందుకు ఈసారి మెయిల్‌ ఇన్‌ ఓట్లను బాగా ప్రోత్సహించారు. పోస్టులోనే తమ ఓట్లు పంపుతామని ఓటర్లు ఆన్‌లైన్‌ ద్వారా ఎన్నికల అధికారులకు దరఖాస్తు చేసుకుంటే, వారికి అధికారులు బ్యాలెట్‌ పేపర్‌ పంపుతారు. దానిలో ఓటర్‌ వివరాలన్నీ రాసి నచ్చిన అభ్యర్థికి ఓటు వేసి తిరిగి పోలింగ్‌ అధికారులకు పోస్టులో పంపాలి. దీనినే మెయిల్‌ ఇన్‌ ఓటు అంటారు. ఈ బ్యాలెట్‌పై చిన్న తప్పు ఉన్నా దానిని తిరస్కరించే అధికారం పోలింగ్‌ అధికారులకు ఉంటుంది. దాంతో మెయిల్‌ ఇన్‌ ఓట్లపై న్యాయపరమైన వివాదాలు చెలరేగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఓట్లపై అవసరమైతే న్యాయపోరాటం చేయాలని అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పటికే నిర్ణయించారు.

Tags :

Advertisement