Advertisement

  • దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదకర రీతిలో ఫోటోలు ...

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదకర రీతిలో ఫోటోలు ...

By: Sankar Tue, 20 Oct 2020 5:15 PM

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదకర రీతిలో ఫోటోలు ...


దుర్గం చెరువుపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కేబుల్‌ బ్రిడ్జిని సందర్శించే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. లాక్‌డౌన్‌ కాలంలో ఇంటికే పరిమితమైన నగరవాసులకు దుర్గం చెరువు మంచి పర్యాటక కేంద్రంగా మారింది. సాయంకాల సమయంలో వెలుగులు విరజిమ్మే లైటింగ్స్‌ అందరినీ ఆకర్షిస్తున్నాయి. దీంతో ఇక్కడ ఫొటోలు దిగేందుకు యువతతో పాటు పెద్దలు కూడా అదే స్థాయిలో పోటీపడుతున్నారు.

అయితే కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తూ వంతెన గుండా ప్రయాణిస్తున్న వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నారు. ఫొటోషూట్లు నిర్వహిస్తూ తమ ప్రాణాలతో పాటు ఇతరుల జీవితాలను కూడా ప్రమాదంలోకి నెడుతున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నా వీరి వైఖరి మారడం లేదు..ఈ క్రమంలో.. ఓ కుటుంబం సోమవారం సాయంత్రం ప్రమాదకర రీతిలో ఫొటోలు దిగుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ట్విటర్‌లో షేర్‌ చేశారు.

రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, దయచేసి బాధ్యతాయుతంగా వ్యవహరించాలంటూ మరోసారి విజ్ఞప్తి చేశారు. కాగా ఇటీవల దుర్గం చెరువు బ్రిడ్జిపై అర్థరాత్రి దుస్తులు విప్పేసి సెల్ఫీలు దిగుతున్న ఇద్దరు వ్యక్తులను మాదాపూర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. లైవ్‌లో పోకిరీల ఆగడాలను చూసిన పోలీసులు.. వాళ్లిద్దరిని అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్‌కి తరలించారు. కాగా గతనెల 25న మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా తీగల వంతెన ప్రారంభమైంది.

Tags :
|
|

Advertisement