Advertisement

  • ప్లాస్మా దానం...ఇంతకంటే గొప్ప యజ్ఞం మరేముంటుంది...

ప్లాస్మా దానం...ఇంతకంటే గొప్ప యజ్ఞం మరేముంటుంది...

By: chandrasekar Sat, 11 July 2020 2:41 PM

ప్లాస్మా దానం...ఇంతకంటే గొప్ప యజ్ఞం మరేముంటుంది...


జీవితం అన్నాక కష్టమూ ఉంటుంది. అనుకోని ఉపద్రవం ఏదో పెనుతుఫానై విరుచుకుపడుతుంది. కొంతమందిలో కష్టం ఎదుర్కొనే స్థయిర్యం ఉంటుంది. అరుదుగా మరికొందరు మాత్రం తమ అనుభవంతో మరొకరికి అండగా నిలిచేందుకు సిద్ధపడతారు. అందుకు ఉదాహరణే సుభాష్‌ నాగ్‌పాల్‌.

ఢిల్లీలో ఉండే సుభాష్‌ది ఓ అందమైన ఉమ్మడి కుటుంబం. అంతా సజావుగా సాగిపోతుండగా కరోనా అడుగుపెట్టింది. సుభాష్‌ సహా, అతని తల్లిదండ్రులు ఇద్దరూ కొవిడ్‌ పాజిటివ్‌గా తేలారు. సుభాష్‌లో రోగ లక్షణాలు తీవ్రంగా లేకపోవడంతో క్వారంటైన్‌కు పరిమితం అయ్యాడు.

తల్లిదండ్రులు మాత్రం తీవ్ర అస్వస్థతతో ఐసీయూలో చేరారు. వారితో ఫోన్లో సైతం మాట్లాడే అవకాశం లేకపోయింది. ముందు తండ్రి చనిపోయాడు. మరో అయిదు రోజులకు తల్లి మరణవార్త కూడా వినాల్సి వచ్చింది. వాళ్లకి తన చేత్తో అంత్యక్రియలు కూడా చేయలేకపోయాడు. తెలియని పశ్చాత్తాపంతో రగిలిపోయాడు.

వాళ్లకు ఆత్మశాంతి కలిగేందుకు ఏదో ఒకటి చేయాలని నిశ్చయించుకున్నాడు. ఇంతలో సుభాష్‌కు ప్లాస్మా థెరపీ గురించి తెలిసింది. కరోనా నుంచి కోలుకొన్నవారి ప్లాస్మాను రోగులకు అందించే చికిత్స అది. బాధితుల పాలిట ఆఖరి ఆశ అది. కానీ ప్లాస్మా ఇచ్చేందుకు చాలామంది ముందుకు రావడమే లేదు.

అదే తన మార్గంగా ఎంచుకున్నాడు సుభాష్‌. ‘నీదేమైనా చిన్న వయసా! యాభై నాలుగేండ్ల వయసులో అంత రిస్క్‌ అవసరమా’ అని అడ్డుకున్నారు బంధువులు. కానీ వెనుదిరగలేదు. ఢిల్లీలోని ఓ ప్రభుత్వాసుపత్రికి చేరుకుని తన ప్లాస్మాను దానం చేస్తున్నాడు. ఆ రోజు తన పుట్టినరోజు కావడం యాదృచ్ఛికమే.

కానీ ‘నా ప్రతి పుట్టినరోజుకీ అమ్మ నా పేరున యాగం చేయించేది. ఈసారి తను లేదు. కానీ ఇంతకంటే గొప్ప యజ్ఞం మరేముంటుంది’ అంటాడు సుభాష్‌. ‘ప్లాస్మా దానం గురించి చాలా అపోహలు ఉన్నాయి. అవేవీ నిజం కాదు. ఈ దానం చేయడం వల్ల నేను కాస్త కూడా నీరసపడలేదు. మళ్లీ 14 రోజుల తర్వాత నేను ప్లాస్మా ఇవ్వవచ్చు అని వైద్యులు చెప్పారు’ అంటూ మరో యజ్ఞానికి సిద్ధపడుతున్నాడు.

Tags :
|

Advertisement