Advertisement

  • ఎలక్ట్రిక్ వాహనాలకు బ్యాటరీలు లేకుండా విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి

ఎలక్ట్రిక్ వాహనాలకు బ్యాటరీలు లేకుండా విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి

By: chandrasekar Sat, 15 Aug 2020 11:13 AM

ఎలక్ట్రిక్ వాహనాలకు బ్యాటరీలు లేకుండా విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి


ఎలక్ట్రిక్ వాహనాలకు బ్యాటరీలు లేకుండా విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వనున్నట్లు తెలిసింది. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే దిశగా వీటిని బ్యాటరీలు లేకుండా దేశంలో విక్రయించేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈవీల్లో అతి ఖరీదైన వస్తువు బ్యాటరీ ప్యాక్ కాబట్టి వాహనాల ధరలను కిందికి దించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

ఎలక్ట్రిక్ వాహనాల ఖరీదులో 40 శాతం వరకు బ్యాటరీ ఖరీదే ఉంటుంది. అయినప్పటికీ ఇవి లేకుండానే అమ్మకాలు జరిపేందుకు అనుమతించనున్నట్టు కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల సంస్థ తెలిపింది. వినియోగదారులు తమ అవసరానికి అనుగుణంగా తమకు నచ్చిన ఎలక్ట్రిక్ బ్యాటరీని అమర్చుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయం బ్యాటరీ పరిశ్రమకు కూడా ఊతమివ్వడంతో పాటు వాటి ధరలు కూడా దిగివచ్చేందుకు తోడ్పడుతుందని భావిస్తున్నారు.

కేంద్రం తీసుకొచ్చిన ఈ నూతన విధానాన్ని ఒకినావా, హీరో ఎలక్ట్రిక్ సహా పలు కంపెనీలు ప్రశంసించగా మహింద్రా ఎలక్ట్రిక్ మాత్రం అందుకు విరుద్ధంగా స్పందించింది. ప్రభుత్వ నిర్ణయం కొంత గందరగోళంగా ఉందని పేర్కొంది. ఈవీ తయారీదారులే వాహనం భద్రతకు బాధ్యులనీ బ్యాటరీలు లేకుండా విక్రయించేందుకు అనుమతించడం వల్ల భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని మహీంద్రా ఎలక్ట్రిక్ పేర్కొంది. బ్యాటరీని వేరే తయారీదారు నుంచి కొనడం వల్ల వారంటీకి సంబంధించిన గందరగోళం కూడా తలెత్తే అవకాశం ఉందని గుర్తుచేసింది.

మహీంద్రా ఎలక్ట్రిక్ విభాగం ఎండీ, సీఈవో మహేశ్ బాబు మాట్లాడుతూ బ్యాటరీ లేకుండా ఈవీలను రిజిస్ట్రేషన్ చేసే విధానం ఏ దేశంలోనూ లేదు. ఈ నోటిఫికేషన్ గందరగోళానికి దారితీసే అవకాశం ఉందని మేము ప్రభుత్వానికి తెలియజేస్తాం. వాహనం విక్రయించే వరకు దాని భద్రతకు తయారీ దారుడే బాధ్యుడు. వాహనం తయారీ, నాణ్యతా పరీక్ష, విక్రయం వరకు అన్నింటికీ అనుసంధానం ఉండాలి. ఈవీపై వారంటీకి తయారీదారే పూర్తి బాధ్యత వహించాలి అని పేర్కొన్నారు. దీనిపై కేంద్రం ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి మరి. భారీగా పెరిగిన పెట్రోల్ దరల వల్ల వాహనాల ప్రయాణ ఖర్చులు విపరీతంగా పెరిగింది. అధికంగా ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి రావడంతో ప్రయాణ ఖర్చులు కనీసంగా తగ్గించుకోవచ్చని అందరి అభిప్రాయం.

Tags :

Advertisement