Advertisement

చిరునవ్వు ఇప్పటికీ కళ్లలో మెదలాడుతోంది

By: Dimple Mon, 31 Aug 2020 11:59 PM

చిరునవ్వు ఇప్పటికీ కళ్లలో మెదలాడుతోంది

ఎన్నేళ్లు బతికామన్నది కాదు. సమాజానికి ఎంత మేలు చేశామన్నది ఎవరైనా లెక్కలేసుకోవాలి. దేవుడు మనకు ఇచ్చిన అవకాశాలను ప్రజల మేలు కోసం ఎంతవరకు ఉపయోగించామని నిరంతరం ఆలోచించాలి. ఇది వైయస్‌ఆర్‌ తరచు అనే మాటలు. ఆయన అలాగే జీవించారు. జనం మరలేని రాజన్నగా నిలిచిపోయారు. ప్రజా నాయకుడిగా ఎదగాలని స్పష్టమైన లక్ష్యంతో పని చేసే ఒక వ్యక్తి , ఎంత ప్రభావ వంతంగా తనదైన ముద్రవేయగలడో తెలియాలంటే వైయస్‌ఆరే ఒక కొలబద్దత, వైయస్‌ఆరే ఒక స్ఫూర్తి.. 2009 సెప్టెంబరు రెండోతేదీ చిత్తూరుజిల్లాలో రచ్చబండ కార్యక్రమంకోసం హెలికాప్టర్లో బయలుదేరిన వైఎస్‌రాజశేఖర్‌ రెడ్డి.. నల్లమల అడవులమీదుగా... వెళ్తూ రుద్రకొండ వద్ద ప్రమాదానికి గురై భౌతికంగా దూరమయ్యాడు. తెలుగుప్రజానీకానికి శోకం మిగిల్చాడు. ఆయన మరణంతో తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయినప్పటికీ.... తరతమ్యాల్లేకుండా... రెండు ప్రాంతాల్లోనూ ఆయన ఫోటోను ఇప్పటికీ ఆరాధిస్తున్నారు.

ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తొలినుంచీ పోరాటమే ఊపిరిగా సాగుతూ వెళ్లారు వైయ‌స్ఆర్‌. ప్రజల కోసం తాను చేపట్టిన పోరాటాన్ని వైఎస్‌ ఏనాడూ ఆపలేదు. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో సొంత పార్టీ ముఖ్యమంత్రులపైనే పోరాటం సాగించిన ధీరత్వం వైఎస్‌ది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా కాంగ్రెస్‌ పార్టీలో హేమాహేమీలనదగ్గ సీనియర్‌ నేతలను ఢీకొట్టి తనను నమ్ముకున్న వారికి న్యాయం చేయించిన పోరాట యోధుడుగా నిలిచారు. సిద్ధాంత పరంగానే తప్ప ఏనాడూ ఆయన పోరాటం వ్యక్తిగత స్థాయిలో ఉండేది కాదు. చివరకు 2004కు ముందు పూర్తిగా కుప్పకూలే దశలోకి చేరిన కాంగ్రెస్‌ పార్టీయే ఆయన బాటలో నడిచే పరిస్థితికి వచ్చింది. సొంత పార్టీలో అలా ఉంటే.. బయట తెలుగుదేశం పార్టీతో, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడి ప్రజావ్యతిరేక పాలనపై వైఎస్‌ పోరాటం మరో ఎత్తు. 1995 నుంచి 2004 ఎన్నికల వరకు చంద్రబాబు ప్రజాకంటక పాలనపై వైఎస్‌ రాజశేఖరరెడ్డి అనేక రూపాల్లో పోరాటం సాగించారు.

సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్తు చార్జీల పెంపు ఇలా ఎన్నో అంశాలపై ప్రజల తరఫున ప్రభుత్వంపై ఉద్యమించారు. విద్యుత్తు చార్జీల పెంపుపై చివరకు తన ప్రాణాలు పోయినా ఫర్వాలేదంటూ ఆమరణ నిరశన దీక్షలు, చలో అసెంబ్లీ కార్యక్రమాలతో నాటి చంద్రబాబు ప్రభుత్వాన్ని గడగడలాడించారు. ప్రతిపక్ష నేతగా ఆయన ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు 2003 ఏప్రిల్‌ 9 నుంచి ప్రజాప్రస్థానం పేరుతో చేపట్టిన పాదయాత్ర చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచింది. మండు వేసవిలో 1,467 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రకు ప్రజలుబ్రహ్మరథం పట్టారు.

Tags :
|
|

Advertisement