Advertisement

  • లోన్ మారటోరియం ముగియనుండటంతో EMI పై సందిగ్ధంలో ప్రజలు

లోన్ మారటోరియం ముగియనుండటంతో EMI పై సందిగ్ధంలో ప్రజలు

By: chandrasekar Mon, 31 Aug 2020 10:43 AM

లోన్ మారటోరియం ముగియనుండటంతో EMI పై సందిగ్ధంలో ప్రజలు


కరోనా కారణంగా ఆర్ధిక సంక్షోభంలో పడ్డ ప్రజలు ఇంకా తేరుకోలేదు. కరోనావైరస్ తీసుకొచ్చిన ఆర్థిక సంక్షోభం అంతా ఇంతా కాదు ఆ ఆర్థిక సంక్షోభం నుంచి జనం బయటపడేందుకు కేంద్రం రెండోసారి విధించిన మారటోరియం గడువు ఈ నెల 31న సోమవారంతో ముగియనుంది. మారటోరియం గడువు ముగియడంతో ఇకపై నెలనెలా రుణాలపై ఈఎంఐలు, క్రెడిట్‌ కార్డు బిల్లులు వడ్డీతోసహా చెల్లించకతప్పదు. లేదంటే రుణం ఇచ్చిన బ్యాంకులు ఊరుకునే పరిస్థితి కనిపించడం లేదు.

దేశంలో కరోనావైరస్ కారణంగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోయి కొత్త ఉద్యోగాలు లభించక ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఉన్న వారు ఇకపై నెల నెల ఈఎంఐ చెల్లించాల్సి వస్తే వారి దుస్థితి ఎంత ఇబ్బందికరమో వూహించలేనంతగా ఉంటుంది. ఇదిలావుంటే, ఇప్పటికే రుణాలు తీసుకున్న వారు తమ ఖాతాల్లో ఇఎంఐకి సరిపోయే మొత్తంలో నగదు నిల్వలు ఉండేలా చూసుకోవాల్సిందిగా సూచిస్తూ బ్యాంకుల నుంచి మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ మోతమోగిస్తుండటం రుణగ్రహీతలకు ఇబ్బందికరమైన పరిణామంగా మారింది.

ఇప్పటికే బ్యాంకులు మారటోరియం కొనసాగింపును వ్యతిరేకిస్తూ గళమెత్తుతున్న సంగతి కూడా తెలిసిందే. ముఖ్యంగా HDFC బ్యాంక్ చైర్మన్ దీపక్ పరేఖ్, కొటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కొటక్, ఎస్బీఐ చైర్మన్ రజ్నిష్ కుమార్ వంటి బ్యాంకర్స్ అంతా మారటోరియంను కొనసాగించకూడదని చెబుతున్నారు. మరోవైపు ప్రస్తుత పరిస్థితి నుంచి బయటపడాలంటే మారటోరియం ఉండాల్సిందేనని పారిశ్రామికవేత్తలు కోరుకుంటున్నారు. దీంతో మారటోరియం కొనసాగింపుపై మున్ముందు ఎలాంటి నిర్ణయం వెలువడనుందా అనేదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. కరోనా వల్ల చిన్న పరిశ్రమలు ఇప్పటికే మూత పడడంతో ఆర్ధిక సంక్షోభంలో పడ్డారు.

మారటోరియం గడువు ఈ నెలాఖరుతో ముగుస్తున్న నేపథ్యంలో లోక్‌సభ టీఆర్‌ఎస్‌ పక్షనేత నామా నాగేశ్వర్‌ రావు మారటోరియం గడువును ఈ ఏడాది చివరి వరకు పొడిగించాల్సిందిగా కోరుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు శనివారం ఓ లేఖ రాశారు. కరోనావైరస్ కారణంగా ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నుంచి ఇంకా జనం కోలుకోనందున మరోసారి మారటోరియం గడువును పొడిగించాల్సిందిగా ఎంపీ నామా ఈ లేఖ ద్వారా కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. చాలామంది మారటోరియం గడువు పొడిగించాలని కోరుతున్నారు. అసలే ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న ఈ సమయంలో EMI కట్టడం గురించి ఆలోచిస్తే మరింత ఇబ్బందుల్లో పడినట్లు అవుతుంది.

Tags :
|
|
|
|

Advertisement