Advertisement

  • పవన్ ర్యాలీ...ఇది పొలిటికల్ స్ట్రాటజీనా లేక మరొకటా...?

పవన్ ర్యాలీ...ఇది పొలిటికల్ స్ట్రాటజీనా లేక మరొకటా...?

By: chandrasekar Fri, 04 Dec 2020 9:05 PM

పవన్ ర్యాలీ...ఇది పొలిటికల్ స్ట్రాటజీనా లేక మరొకటా...?


జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ వైపు కొత్త సినిమాల షూటింగులు జరుగుతున్నా పవర్ స్టార్ ప్రజల్లోకి రావడాన్ని ఎలా చూడాలి..? ఇది పొలిటికల్ స్ట్రాటజీనా లేక మరొకటా...? ఉన్నట్లుండి పవన్ జై కిసాన్ నినాదం ఎత్తుకోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్ట్ టైమ్ పొలిటీషియన్ అనే విమర్శలు ఎదుర్కొంటున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాష్ట్రంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. తొలి రోజు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించిన ఆయన ప్రస్తుతం చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. తుఫాన్ దెబ్బకు నష్టపోయిన రైతులకు మెరుగైన పరిహారం అందించాలని తన పర్యటనలో పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. రైతులకు రూ.10వేల పరిహారం సరిపోదని ఎకరాకు రూ.30వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని.. అన్నదాతలకు న్యాయం చేయకుండా జై కిసాన్ పేరుతో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

తమపార్టీ బలాన్ని నిరూపించుకునేందుకే పవన్ కల్యాణ్ చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన-బీజేపీ కలిసి బరిలో దిగుతున్న నేపథ్యంలో తమ పార్టీకే అభ్యర్ధిత్వాన్ని దక్కించుకునేందుకు బలనిరూపణ కోసమే పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. తిరుపతి టికెట్ మాకేనని బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తుండటం కూడా పవన్ సడన్ టూర్ కు కారణంగా చెప్పొచ్చు. ఇక ‘జై కిసాన్’ నినాదం వెనుక ఇంకో రీజన్ ఉన్నట్లు సమాచారం. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టసవరణ బిల్లులపై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో రైతులు జనసేనకు రైతులు దూరం కాకూడదనే ఉద్దేశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చిలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవం తర్వాత పవన్ కల్యాణ్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కూడా పెద్దగా నిర్వహించలేదు. దీంతో ప్రజలకు దూరం కాకూడదన్న భావన కూడా ఒకటై ఉండొచ్చు. మొత్తానికి చాలా రోజుల తర్వాత ప్రజల్లోకి వచ్చిన జనసేనాని రైతుల సమస్యలు, డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా అటు నుంచి మాత్రం పెద్దగా స్పందన రాలేదు. అధికార పార్టీ అసలు పవన్ టూర్ ను పట్టించుకోనట్లే కనిపిస్తోంది. గతంలో పవన్ కనిపిస్తే చాలు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించే వైసీపీ లీడర్లు ఈసారి మాత్రం లైట్ తీసుకున్నట్లే తెలుస్తోంది.

Tags :
|
|

Advertisement