Advertisement

  • పామ్‌ నీరా ద్వారా తాటి బెల్లం, తాటి, ఈత సిరప్‌లు

పామ్‌ నీరా ద్వారా తాటి బెల్లం, తాటి, ఈత సిరప్‌లు

By: chandrasekar Tue, 09 June 2020 5:48 PM

పామ్‌ నీరా ద్వారా తాటి బెల్లం, తాటి, ఈత సిరప్‌లు


పామ్‌ నీరా, పామ్‌ ప్రొడక్ట్స్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌, వేద పామ్‌ ప్రొడక్ట్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో తయారు చేసిన తాటి బెల్లం, తాటి, ఈత సిరప్‌లను రాష్ట్ర ఆబ్కారిశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆవిష్కరించారు. నగరంలోని రవీంద్రభారతిలో గల తన కార్యాలయంలో మంత్రి వీటిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా నీరా పాలసీని ప్రవేశపెట్టి గీత వృత్తిదారుల ఆత్మగౌరవాన్ని పెంచారన్నారు.

గీత వృత్తిదారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం నీరా పాలసీని ప్రవేశపెట్టారన్నారు. ప్రజల ఆరోగ్యానికి మేలు చేసే విధంగా ఆయుర్వేద పద్దతిలో తాటి బెల్లం, తాటి, ఈత సిరప్‌లను తయారు చేసినట్లు తెలిపారు. మధుమేహం, మూత్రపిండాల్లోని రాళ్లు కరిగిపోవడం, మూత్ర సంబంధ వ్యాధులను నివారించేందుకు నీరా సహ ఉత్పత్తులు ఉపయోగపడుతాయన్నారు.

నీరా ఉత్పత్తుల వాడకం వల్ల నిరోధకశక్తి పెరుగుతుందన్నారు. వీటితో పాటు శరీరానికి కాల్షియం, పొటాషియం, ఐరన్‌ చేకూరుతాయన్నారు. మలబద్దకం, జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలను నివారిస్తుందన్నారు. మైగ్రేన్‌, బరువు తగ్గడంలోనూ, శరీరంలోని వేడిని తొలగించడంలోనూ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నీరా బై ప్రొడక్ట్స్‌లను తయారు చేయటానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. హైదరాబాద్‌ నగరంలోని నెక్లెస్‌రోడ్‌లో ఏర్పాటు చేసే నీరా కేంద్రాన్ని ఆధునిక పద్దతిలో రూపొందించబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే టెండర్లు పూర్తి అయ్యాయన్నారు. త్వరలోనే పనులు పూర్తి చేసి దశలవారీగా జిల్లా కేంద్రాలకు విస్తరించనున్నట్లు చెప్పారు.

ఈ ఆవిష్కరణలో రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు పల్లె లక్ష్మణ్‌రావు గౌడ్‌, అంబాల నారాయణ గౌడ్‌, వింజమూరి సత్యం గౌడ్‌, భాను చందర్‌, శ్రీనివాస్‌, ధర్మరాజు, రామ్మోహన్‌ గౌడ్‌, ఈతముల్లు ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :
|

Advertisement