Advertisement

పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ పై 188 దేశాల్లో నిషేధం !

By: Sankar Mon, 09 Nov 2020 8:06 PM

పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ పై 188 దేశాల్లో నిషేధం !


మ దేశంలో ఉన్న 860 మంది పైలట్లలో దాదాపు 262 మంది బోగస్‌ పైలట్లేనన్న ప్రకటన పాకిస్తాన్‌ ఎయిర్‌లైన్స్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. లైసెన్స్‌ కుంభకోణం కారణంగా దాదాపు 188 దేశాల్లో పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌(పీఐఏ) రాకపోకలపై నిషేధం విధించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఇంటర్నేషనల్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఆర్గనైజేషన్‌(ఐసీఏవో) ప్రమాణాలు పాటించకుండా ఇష్టారీతిన పైలట్‌ లైసెన్సులు జారీ చేసిన నేపథ్యంలో సంస్థ, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కాగా పైలట్‌ శిక్షణ, లైసెన్సింగ్‌ జారీ ప్రక్రియ అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లు లేవంటూ ఐసీఏవో, నవంబరు 3న పాకిస్తాన్‌ ఏవియేషన్‌ అథారిటీకి లేఖ రాసింది. ఈ విషయం గురించి అనేకమార్లు హెచ్చరించినప్పటికీ పాక్‌ తీరు మారడం లేదని, కాబట్టి పాకిస్తాన్‌ విమానాలు, పైలట్లపై నిషేధం విధించే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది..

ఈ విషయం గురించి పాకిస్తాన్‌ ఎయిర్‌లైన్స్‌ పైలట్స్‌ అసోసియేషన్‌(పీఏఎల్‌పీఏ) అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ‘‘ఇదే గనుక నిజమైతే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుంది. పాక్‌ పౌరవిమాన రంగం కుప్పకూలిపోతుంది. గత ఆర్నెళ్లుగా ఈ విషయం గురించి మేం అధికారుల దృష్టికి తీసుకువెళ్తూనే ఉన్నాం. కానీ వారు పట్టించుకోలేదు. నిర్లక్ష్య వైఖరి కారణంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఈ విషయంలో జోక్యం చేసుకుని, స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసి తమ సమస్యలు పరిష్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు

Tags :

Advertisement