Advertisement

  • ఆయుర్వేద మంత్రాన్ని గెలుపు తంత్రంగా ఎంచుకున్న ఎన్షియంట్ లివింగ్ ప్రొడక్ట్స్ యజమాని

ఆయుర్వేద మంత్రాన్ని గెలుపు తంత్రంగా ఎంచుకున్న ఎన్షియంట్ లివింగ్ ప్రొడక్ట్స్ యజమాని

By: chandrasekar Wed, 02 Sept 2020 11:49 AM

ఆయుర్వేద మంత్రాన్ని గెలుపు తంత్రంగా ఎంచుకున్న ఎన్షియంట్ లివింగ్ ప్రొడక్ట్స్ యజమాని


ఎన్షియంట్‌ లివింగ్‌ ప్రొడక్ట్స్‌ యజమానిగా, స్త్రీశక్తికి చిరునామాగా నిలిచింది ఆంత్రపెన్యూర్‌ కళ్యాణి గోంగి. ఆయుర్వేద మంత్రాన్ని గెలుపు తంత్రంగా ఎంచుకుంది. కళ్యాణిది హైదరాబాద్‌. ఆమె తండ్రికి వ్యవసాయ భూములు ఉన్నాయి. చిన్నప్పుడు తండ్రితో పాటు అక్కడికి వెళ్లేది. పొలంలో ఔషధ, ఆయుర్వేద మొక్కలు సాగుచేసేవాడు కళ్యాణి తండ్రి. ప్రతి మొక్కనూ ఆసక్తిగా గమనించేది. ఏ మొక్క ఎలా ఉపయోగపడుతుందో, అందులోని ఔషధ గుణాలేంటో అడిగి తెలుసుకునేది. అలా మనిషికి అవసరమయ్యే ఉత్పత్తులు తయారు చేసేందుకు రసాయనాలను వాడాల్సిన అవసరం లేదని, ప్రకృతి ప్రసాదించిన వనమూలికలే మేలు చేస్తాయని గ్రహించింది.

బీటెక్‌ పూర్తయ్యాక బెంగళూరులో ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరింది కళ్యాణి. మంచి ఉద్యోగం, ప్రశాంతమైన జీవితం అయినా ఏదో లోటుగా అనిపిస్తుండేది. ధ్యాసంతా మొక్కలు, ఔషధాలపైనే ఉండేది. ఉద్యోగాన్ని వదులుకొని తన మనసుకు నచ్చిన రంగంలోకి ప్రవేశించాలని భావించింది. సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసిన ఔషధ మొక్కల నుంచి షాంపూలు, ఎసెన్షియల్‌ నూనెలు, సౌందర్య సాధనలు తయారు చేయాలని నిర్ణయించుకుంది. కుటుంబ సభ్యులు కూడా వెన్నుతట్టడంతో 2011లో ఎన్షియంట్‌ లివింగ్‌ ప్రొడక్ట్స్‌ పేరిట కళ్యాణి జీడిమెట్లలో పరిశ్రమ ప్రారంభించింది. వ్యాపారంలో నైపుణ్యం సాధించాలని ఐఎస్‌బీ‌ లో చేరి ప్రత్యేక కోర్సు చేసింది. మరోవైపు సౌందర్య ఉత్పత్తుల తయారీ ముమ్మరం చేసింది.

కుంకుడుకాయ, షికాయ, ఉసిరి, మందారం, బాదం నూనె, కస్తూరి పసుపు, ఆర్గానిక్‌ కొబ్బరినూనె, లావెండర్‌ ఆయిల్‌, ఆలివ్‌ నూనె తదితర ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. సర్టిఫైడ్‌ ఆర్గానిక్‌ ఫామ్స్‌ నుంచి 550 రకాల మూలికలు సేకరించి వాటితో ఈ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. తైలపాక విధానంలో అష్టాదశ హెయిర్‌ ఆయిల్‌ను తయారు చేస్తారు. 18 రకాల మూలికలతో తయారైన ఈ నూనె కేశ సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నది కళ్యాణి. సేంద్రియ మూలికలతో తయారు చేయడం వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవని అంటున్నది.

పెయిన్‌ రిలీఫ్‌ ఆయిల్స్‌, ఫేస్‌ప్యాక్‌లు, బేబీ కేర్‌, మదర్‌ కేర్‌ వంటి ఉత్పత్తులనూ తయారు చేస్తున్నారు. కంపెనీ ఉత్పత్తుల నాణ్యత పరీక్షించడానికి ప్రత్యేకంగా మైక్రోబయాలజీ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ఒక మహిళగా తన సత్తా చాటుకున్న కళ్యాణి తన పరిశ్రమలో మహిళా ఉద్యోగులకే పెద్ద పీట వేసింది.

స్త్రీలకు ఆర్థికంగా చేయూతనిస్తున్నది. మహిళలకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించి.. ఉపాధి కల్పిస్తున్నది. ప్రత్యక్షంగా 70 మంది, పరోక్షంగా 300 మందికి ఉపాధి పొందుతున్నారు. ప్రకృతి ప్రసాదించిన వస్తువులను ముడిసరుకుగా వ్యాపారం చేస్తున్న కళ్యాణి.. పర్యావరణహితానికి పాటుపడుతున్నది. తమ పరిశ్రమ ఉత్పత్తులను విక్రయించేందుకు చేసే ప్యాకింగ్‌లో పర్యావరణానికి ఎలాంటి హానీ తలపెట్టకుండా జాగ్రత్త పడుతున్నది. ప్యాకింగ్‌లో ప్లాస్టిక్‌కు బదులుగా గ్లాస్‌ బాటిల్స్‌, క్రాఫ్ట్‌ పేపర్‌ వినియోగిస్తుండటం విశేషం. వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగిన కళ్యాణి.. 2017లో హైదరాబాద్‌లో జరిగిన గ్లోబల్‌ ఆంత్రపెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌లో పాల్గొన్నది. ప్రకృతిలోని మంచిని పదిమందికీ పంచాలనే లక్ష్యంతో తానీ వ్యాపారం మొదలుపెట్టానని చెబుతున్నదామె. అమెరికా, కెనడా, మాల్దీవులు, యూకే తదితర దేశాల్లోనూ దాదాపు 255 రకాల ఎన్షియంట్‌ లివింగ్‌ ప్రొడక్ట్స్‌ విక్రయాలు కొనసాగుతున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో సొంతగా ఆరు స్టోర్లలో ఉత్పత్తులు విక్రయిస్తుండగా, ఇతర ఆర్గానిక్‌ స్టోర్లలో కూడా అమ్మకాలు చేస్తున్నారు.

మాస్క్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఎక్కడైనా చేతులు శుభ్రం చేసుకునే విధంగా మినీసోప్‌ బాల్స్‌ను ఉత్పత్తి చేశారు. పాత తరానికి చెందిన ఆటలను కొత్తగా పరిచయం చేస్తున్నది కళ్యాణి. వామన గుంటలు, పచ్చీసు, అష్టాచమ్మా, పులిమేక వంటి ఆట వస్తువులను చెక్క, నూలు వస్త్రాలతో తయారు చేసి అందిస్తున్నది. ఆటల్లో ఉపయోగించే వస్తువులు కూడా చెక్కతో చేసినవే కావడం విశేషం. ఈ ఆటల్లోనూ పర్యావరణ స్పృహ కలిగేలా చూస్తున్నది. కాలుష్యం పాములు కాటువేస్తే జీవితం పతనం అవుతుందని తెలుపుతూ వైకుంఠపాళిని కొత్తగా డిజైన్‌ చేసింది. త్వరలో యోగాపై రూపొందించిన ఆటలను పరిచయం చేయనుంది.

Tags :
|

Advertisement