Advertisement

తెలంగాణలో ఒకేరోజు 1800కు పైగా కరోనా కేసులు

By: chandrasekar Wed, 08 July 2020 6:02 PM

తెలంగాణలో ఒకేరోజు 1800కు పైగా కరోనా కేసులు


కరోనా కేసులు తెలంగాణలో రెట్టింపు స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం ఒక్కరోజులోనే రికార్డు సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. మొత్తం 1879 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 27,612కు చేరుకుంది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 11,012గా ఉన్నాయి.

గత 24 గంటల్లో 1,506 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 16,287కు చేరింది. ఇక మంగళవారం మరో ఏడుగురు కరోనాకు బలి కాగా, మొత్తం చనిపోయిన వారి సంఖ్య 313కి చేరింది. మంగళవారం నాడు గుర్తించిన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ భారీ ఎత్తున కేసులను గుర్తించారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికంగా 1,422 కొత్త కేసులు నమోదు కావడం విస్మయం కలిగిస్తోంది.

ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉంది. అక్కడ 176 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత మేడ్చల్ జిల్లాలో 94 కొత్త కరోనా కేసులను గుర్తించారు. దాని తర్వాతి స్థానంలో మంగళవారం కరీంనగర్ జిల్లా ఉంది. ఇక్కడ 32 కేసులు నమోదయ్యాయి. ఇక నల్గొండ జిల్లాలో 31 కేసులు, నిజామాబాద్‌లో 19 కేసులు గుర్తించారు.

మొదక్‌, ములుగు జిల్లాల్లో 12, వరంగల్ అర్బన్ జిల్లాలో 13, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో 9, కామారెడ్డిలో 7, జయశంకర్ భూపాలపల్లిలో 6, గద్వాలలో 4, పెద్దపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 3, జగిత్యాల, మహబూబాబాద్, సిరిసిల్ల జిల్లాల్లో 2 కేసులు, వికారాబాద్, ఆదిలాబాద్, జనగామ, వనపర్తి, సిద్దిపేట జిల్లాల్లో ఒక్కోకేసు చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి.

మరోవైపు, తెలంగాణలో మంగళవారం ఒక్కరోజే 6,220 కరోనా టెస్టులు నిర్వహించారు. వీటిలో నుంచే 1,879 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకూ తెలంగాణలో చేసిన కరోనా టెస్టుల సంఖ్య 1,28,4388కు చేరింది. మంగళవారం 4,341 ఫలితాలు నెగెటివ్‌గా తేలాయి.

Tags :
|
|

Advertisement