Advertisement

ఉస్మానియా ఆస్పత్రి కులసివేత...

By: Anji Mon, 31 Aug 2020 3:33 PM

ఉస్మానియా ఆస్పత్రి కులసివేత...

ఉస్మానియా ఆస్పత్రి కూల్చివేతపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. పురాతన ఉస్మానియా భవనం కూల్చవద్దని సత్యం రెడ్డి, రచన రెడ్డి వాదనలు వినిపించారు. పురాతన భవనం కూల్చకుండా పక్కనే కొత్త ఆస్పత్రి నిర్మించవచ్చు నని న్యాయవాదులు పేర్కొన్నారు. దీంతో ఉస్మానియా ఆస్పత్రి సైట్ ప్లాన్ సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఉస్మానియా ఆస్పత్రి కూల్చివేతకు సంబంధించిన తదుపరి విచారణను హైకోర్టు సెప్టెంబర్ 8కి వాయిదా వేసింది.

ప్ర‌స్తుతం ఉన్న భ‌వ‌నం శిథిలావ‌స్థ‌కు చేరింద‌ని, దానిని తొలగించి నూత‌న భ‌వ‌నం నిర్మిస్తామ‌ని ప్ర‌భుత్వం ఈ సంద‌ర్భంగా కోర్టుకు వివ‌రించింది. కొత్త నిర్మాణానికి సంబంధించి పూర్తి వివ‌రాల‌తో ప్ర‌భుత్వం కౌంటర్ దాఖ‌లు చేసింది. అయితే ఎర్ర‌మంజిల్ భ‌వ‌నంపై గ‌తంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించిన పిటిష‌నర్లు ఈ తీర్పు ఉస్మానియాకు కూడా వ‌ర్తిస్తుంద‌ని వాదించారు. పురాత‌న క‌ట్ట‌డాన్ని కూల్చివేయ‌కుండా ప‌క్క‌న ఉన్న16 ఎక‌రాల స్థ‌లంలో నూత‌న నిర్మాణం చేప‌ట్టాల్సిందిగా పిటిష‌న‌ర్లు కోర్టుకు విన్నవించారు.


హైదరాబాదులోని అఫ్జల్ గంజ్‌లో ప్రస్తుతం ఉన్న ఉస్మానియా ఆస్పత్రిని నిజాం కాలంలో నిర్మించారు. భారత దేశంలో ఉన్న అతి పురాతనమైన ఆసుపత్రిలలో ఇది ఒకటి. ఆఖరు నిజామైన ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో నిర్మించబడటంతో అతని పేరు మీద ప్రసిద్ధికెక్కింది. ఉస్మానియా ఆస్పత్రికి పాత భవనానికి వందేండ్లకుపైగా చరిత్ర ఉంది. అయితే గత పాలకుల సరైన పర్యవేక్షణ లేకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంది.


తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించారు. అక్కడి దుస్థితిని స్వయంగా చూసిన ఆయన.. పాతభవనాన్ని తొలగించి రెండు టవర్లతో, అధునాతన హంగులతో కొత్త భవనం నిర్మిస్తామని ప్రకటించారు. అయితే సర్కారు నిర్ణయాన్ని ప్రతిపక్షాలు, పలు సంఘాలు.. తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.హెరిటేజ్‌ భవనం పేరిట పాతభవనాన్ని తొలగించకుండా, కొత్తదాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాయి.

Tags :

Advertisement