Advertisement

కన్నీరు తెప్పించబోతున్న ఉల్లిపాయల ధరలు

By: Dimple Tue, 25 Aug 2020 11:09 AM

కన్నీరు తెప్పించబోతున్న ఉల్లిపాయల ధరలు

మార్కెట్లో ఉల్లిపాయలధరలకు రెక్కలొచ్చాయి. నిన్న మొన్నటిదాకా వంద రూపాయలకు పది కిలోలు అమ్ముడయ్యేవి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గోదాముల్లో నిల్వ ఉన్న ఉల్లిపాయలు పూర్తిగా అమ్ముడయ్యాయి. దిగుబడులు తగ్గుముఖం పట్టడంతో నెమ్మదిగా రోజు రోజుకు ఉల్లిపాయల ధరలు పెరిగిపోతున్నాయి. రాబోయే రోజుల్లో ఉల్లిపాయల ధరలు కన్నీరు తెప్పించబోతున్నాయి. ఇప్పటికే కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తుండటంతో పరిస్థితి రోజురోజుకూ అధ్వానంగా తయారవుతోంది. ఆంద్రప్రదేశ్‌, తెలంగాణ జిల్లాల నుంచి ఉల్లి దిగుమతులు ఆగిపోవడం, మహారాష్ట్ర నుంచి అనుకున్న దానికి కంటే సగం ఉల్లి మాత్రమే సరఫరా అవుతుండటం కూడా ఉల్లి ధర ఘాటెక్కేందుకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు.

గత వారంతో పోలిస్తే ఈ వారం ఉల్లి ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. వర్షాలతో మార్కెట్‌కు డిమాండ్‌కు తగ్గ సరఫరా కాకపోవడంతో ఉల్లి ధరలు పెరిగాయని మార్కెట్‌ అధికారులు అంటున్నారు. మహారాష్ట్ర నుంచి ఉల్లి దిగుమతులు తగ్గడంతో పాటు, స్థానికంగా కూడా ఉల్లి దిగుమతులు భారీగా తగ్గాయి. దీంతో నగర మార్కెట్‌లకు ఉల్లి దిగుమతులు తగ్గడంతో ధరలు పెరిగాయని హోల్‌సెల్‌ వ్యాపారులు చెబుతున్నారు. గత వారం హోల్‌సెల్‌ మార్కెట్‌లో ఉల్లి కిలో రూ. 8 నుంచి 12 వరకు ధర పలుకుతుండగా... ప్రస్తుతం కిలో రూ. 22 నుంచి రూ. 32 వరకు పలుకుతోంది. సోమవారం నుంచి ఉల్లి నగరంలోని బోయిన్‌పల్లి, గుడి మల్కాపూర్, మలక్‌పేట్‌కు కర్నూలు, కర్ణాటకతో పాటు తెలంగాణ జిల్లాల నుంచి లోకల్‌ ఉల్లి దిగుమతులు తగ్గాయి. దీంతో ధరలు పెరగడం ప్రారంభమయ్యాయి.

సాధారణంగా నగర ఉల్లి అవసరాల్లో దాదాపు 60 శాతం మే మహారాష్ట్ర దిగుమతులే తీరుస్తాయి. పూణె, నాసిక్‌తోపాటు షోలాపూర్‌ తదితర జిల్లాల నుంచి నగర మార్కెట్‌కు రోజూ దాదాపు 60 లారీల ఉల్లి దిగుమతి అవుతుంది. మిగతా 40 శాతం కర్ణాటక, కర్నూలుతోపాటు తెలంగాణ జిల్లాల నుంచి వస్తుంది. వర్షాల కారణంగా మహారాష్ట్రలో చేతికి అందిన ఉల్లి నోటికి చేరలేదు. దాని ప్రభావం నగర మార్కెట్‌పై పడింది. రోజు మలక్‌పేట్‌ మార్కెట్‌కు 60 నుంచి 70 లారీల ఉల్లి దిగుమతి అయ్యేది. వర్షాలతో 30 నుంచి 35 లారీల ఉల్లి మాత్రమే దిగుమతి అవుతోంది.


Tags :

Advertisement