Advertisement

మరో మూడు నెలలు ఉల్లి ధరలు తగ్గే అవకాశం లేదు...

By: chandrasekar Fri, 30 Oct 2020 4:32 PM

మరో మూడు నెలలు ఉల్లి ధరలు తగ్గే అవకాశం లేదు...


ఉల్లిపంట ఇటీవల కురిసిన వర్షాల కారణంగా భారీగా దెబ్బతింది. మన రాష్ట్రంలో వానాకాలం పంట పూర్తిగా పోగా.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌‌, కర్నాటక, గుజరాత్‌‌తో పాటు ఏపీలోని కర్నూల్‌‌ జిల్లాలో 50% పంట‌‌ నష్టం అయ్యింది. దీంతో రాష్ట్రానికి రావాల్సిన ఉల్లి దిగుమతి పడిపోయింది. ఇది ఉల్లి రేట్లపై ప్రభావం చూపుతోంది. పంట‌‌‌‌ తీసేసి మళ్లీ వేస్తుండడంతో మరో 3 నెలల పాటు ఉల్లి ధరలు తగ్గే అవకాశం లేదని మార్కెటింగ్‌‌ వర్గాలు అంటున్నాయి. తాండూరు, నారాయణఖేడ్‌‌, కొల్లాపూర్‌‌, అలంపూర్‌‌, నల్గొండ తదితర ప్రాంతాల్లో ఈ సీజన్‌‌లో ఉల్లి దాదాపు దెబ్బతిన్నది. పంట 30% చేతికందిందని, ఉన్న పంటను స్థానికంగానే అమ్ముకున్నట్టు రైతులు చెబుతున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో పండే ఉల్లి అక్టోబర్, నవంబర్ నెలల్లోనే వస్తుంది. అయితే చాలావరకు పంట నష్టపోవడంతో ఉల్లి దిగుబడిపై ప్రభావం‌‌ పడింది. ఒక వైపు వినియోగదారులు కొనుక్కునేందుకు ఇబ్బందులు పడుతుంటే పంట అమ్ముకునే రైతుకు ఫలితం దక్కడం లేదని, దళారులే బాగుపడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.

మహారాష్ట్రలోని నాసిక్‌‌, ఏపీలోని కర్నూల్‌‌, మన రాష్ట్రంలోని గద్వాల, మహబూబ్‌‌నగర్‌‌ ప్రాంతాల నుంచి ఉల్లి దిగుమతులు వస్తుంటాయి. రోజుకు 70 నుంచి 100 లారీల వరకు వచ్చే ఉల్లి గురువారం 35 లారీల లోడ్లు మాత్రమే వచ్చాయి. అదీ నాసిక్, కర్నూల్‌‌ నుంచి 5,567 క్వింటాళ్ల పాత ఉల్లిగడ్డలే. దిగుమతులు తగ్గి ఉల్లి ధరలు పెరగడంతో రాష్ట్ర మార్కెటింగ్‌‌ శాఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్‌‌ను ఆశ్రయించింది. 500 టన్నుల ఇండెంట్‌‌ పెట్టగా మొదటి విడతగా 100 టన్నులను సప్లయ్ చేసింది. దీంతో హైదరాబాద్‌‌ సిటీలోని 11 రైతు బజార్లలో ఒక్కో వినియోగదారునికి కిలో రూ.35 చొప్పున అందిస్తున్నట్టు మార్కెటింగ్‌‌ శాఖ డైరెక్టర్‌‌ లక్ష్మీబాయి తెలిపారు. హైదరాబాద్‌‌లోని మలక్‌‌పేట్‌‌ హోల్‌‌సేల్‌‌ మార్కెట్‌‌లో ఉల్లి గరిష్ట ధర రూ.65 ఉండగా.. బహిరంగ మార్కెట్‌‌లో కిలో రూ.80కి పైగా అమ్ముతున్నారు. గత రెండు నెలల కిందట ధరలతో పోలిస్తే ఐదారు రెట్లు అధిక ధరలకు అమ్ముతున్నారు. డిమాండ్‌‌కు తగిన సరఫరా లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయని మార్కెటింగ్‌‌ వర్గాలు చెబుతున్నాయి. గత ఆగస్టులో ఉల్లికి రేటు లేక హోల్‌‌సేల్‌‌ మార్కెట్‌‌లో రూ.5 నుంచి రూ.9లోపే అమ్మారు. సెప్టెంబరులో హోల్‌‌సేల్ లో రూ.25 నుంచి 35 వరకు విక్రయించారు. అక్టోబర్‌‌లో రూ.65 నుంచి రూ.100 వరకు అమ్ముడవుతోంది.

Tags :
|
|

Advertisement