Advertisement

  • ఒకరి సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత మరొకరు గౌరవించాలి: మోదీ

ఒకరి సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత మరొకరు గౌరవించాలి: మోదీ

By: chandrasekar Wed, 11 Nov 2020 7:47 PM

ఒకరి సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత మరొకరు గౌరవించాలి: మోదీ


ఉగ్రవాదం, మనీలాండరింగ్, మాదక ద్రవ్యాల రవాణా ప్రపంచానికి ముప్పుగా మారాయ‌ని, భారత్ వీటికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ పేర్కొన్నారు. షాంఘై సహకార సంస్థ వర్చువల్ కాన్ఫరెన్స్‌లో మోదీ పాల్గొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ నేతృత్వంలో జరిగిన ఈ సదస్సుకు మోదీతో పాటు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా మోదీ మట్లాడుతూ.. ఆత్మనిర్భర్‌ భారత్ నేడు ప్రపంచానికి ఓ శక్తి గుణకంగా మారింద‌ని చెప్పారు. ఉగ్రవాదం, మనీలాండరింగ్, మాదక ద్రవ్యాల రవాణా ప్రపంచానికి ముప్పుగా మారాయ‌ని, భారత్ వీటికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నద‌ని ప్ర‌ధాని మోదీ గుర్తుచేశారు. SCO సభ్య దేశాలు ఒకరి సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత మరొకరు గౌరవించాలని సూచించారు. పాకిస్థాన్‌, చైనా దేశాలను ఉద్దేశించి ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ దేశాల‌కు షాంఘై స‌హ‌కార సంస్థ వేదిక‌గా గట్టి కౌంటర్ ఇచ్చినట్టయింది.

ఐకరాజ్యసమితి 75 ఏండ్లు పూర్తి చేసుకుంది. ఈ ప్రయాణంలో అనేక విజయాలు సాధించినప్పటికీ, ఐకరాజ్య సమితి ప్రాథమిక లక్ష్యం ఇప్పటికీ అసంపూర్ణంగానే ఉంది. కరోనా మహమ్మారి విజృంభించిన ఈ కష్ట సమయంలో భారత్‌లోని ఔషధ పరిశ్రమ 150కి పైగా దేశాలకు అవసరమైన మందులను అంద‌జేసింది. ప్రపంచంలోనే అందరికంటే మెరుగైన టీకా ఉత్పత్తి చేసే దేశంగా నిలిచింది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో మొత్తం మానవాళికి సహాయపడటానికి భారత్ తన టీకా ఉత్పత్తి, పంపిణీ సామర్థ్యాన్ని ఉపయోగిస్తున్న‌ది అని మోదీ పేర్కొన్నారు. కాగా, కొన్ని నెల కిందట ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో తాత్కాలిక సభ్యత్వానికి జరిగిన ఎన్నికల్లో భారత్‌ విజయం సాధించింది. మొత్తం 192 సభ్య దేశాలకుగాను 184 దేశాల‌ ఓట్లను సొంతం చేసుకుని భార‌త్‌ తాత్కాలిక సభ్యదేశ హోదాను దక్కించుకుంది. రెండేళ్ల కాలానికి భారత్‌ ఈ హోదాలో ఉంటుంది. తాత్కాలిక స‌భ్య‌దేశం హోదా కాలం 2021 జనవరి ఒకటోతేదీ నుంచి ప్రారంభం అవుతుంది.

ఐక్య‌రాజ్య‌స‌మితి భద్రతామండలిలో ఐదు శాశ్వత సభ్య దేశాలుంటాయి. వీటితోపాటు పది తాత్కాలిక సభ్య దేశాలకూ మండలిలో చోటుంటుంది. ప్ర‌స్తుతం అమెరికా, చైనా, ఫ్రాన్స్‌, రష్యా, బ్రిటన్‌ శాశ్వత సభ్యదేశాలుగా ఉన్నాయి. తాత్కాలిక సభ్య దేశాలు రెండేండ్ల‌ కాలపరిమితితో ఎన్నికవుతూ ఉంటాయి. ఈస్తోనియా, నైజర్‌, సెయింట్‌ విన్సెంట్‌, గ్రెనడైన్స్‌, ట్యునీషియా, వియత్నాం, బెల్జియం, డొమినికన్‌ రిపబ్లిక్‌, జర్మనీ, ఇండోనేషియా, దక్షిణాఫ్రికాలు ఇప్పుడు తాత్కాలిక స‌భ్య‌దేశాలుగా ఉన్నాయి. వాటిలో బెల్జియం, డొమినికన్ రిపబ్లిక్, జర్మనీ, ఇండోనేషియా, దక్షిణాఫ్రికాల రెండేండ్ల‌ కాలపరిమితి ఈ ఏడాదితో ముగియనుంది. భారత్‌తోపాటు కొత్తగా ఎన్నికైన తాత్కాలిక స‌భ్య‌ దేశాలు ఆయా స్థానాలను భర్తీ చేయనున్నాయి. కాగా, ఐకరాజ్య సమితి భద్రతా మండలికి భారత్ ఎన్నికవ్వడం ఇది ఎనిమిదోసారి.

Tags :
|
|

Advertisement