Advertisement

  • దేశ భద్రత కోసమే యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు చెప్పడం ఓ సాకు: ధ్వజమెత్తిన చైనా

దేశ భద్రత కోసమే యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు చెప్పడం ఓ సాకు: ధ్వజమెత్తిన చైనా

By: chandrasekar Wed, 25 Nov 2020 7:54 PM

దేశ భద్రత కోసమే యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు చెప్పడం ఓ సాకు: ధ్వజమెత్తిన చైనా


భారత్ చైనా యాప్‌ల విషయంలో తీసుకున్న నిర్ణయంపై డ్రాగన్ తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. భారత్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొంది. దేశ భద్రత కోసమే యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు చెప్పడం ఓ సాకు మాత్రమేనని ధ్వజమెత్తింది. తమ యాప్‌ల నిషేధానికి‘దేశ భద్రత’ సాకును పదే పదే భారత్ వాడుకుంటోందని డ్రాగన్ మండిపడింది. మంగళవారం కేంద్రం తాజాగా మరో 43 యాప్‌లను నిషేధించగా వీటిలో ఎక్కువ భాగం చైనా కేంద్రంగా పనిచేస్తున్నాయి. ఈ యాప్‌ల కార్యకలాపాలు భారత సార్వభౌమత్వం, సమగ్రతకు ముప్పుగా పరిణమించాయని, దేశ రక్షణ, భద్రత, ప్రజా శాంతికి విరుద్ధంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. భారత్‌లో చైనా రాయబార కార్యాలయం అధికార ప్రతినిధి జీ రోంగ్ మాట్లాడుతూ.. చైనా నేపథ్యం ఉన్న మొబైల్ యాప్‌లను నిషేధించేందుకు భారత్ పదే పదే ‘దేశ భద్రత’ను సాకుగా చూపడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు.

చైనా అన్ని దేశాల మార్కెట్ ప్లేయర్స్‌కి న్యాయమైన, నిష్పాక్షిక, వివక్షరహిత వ్యాపార వాతావరణాన్ని భారత దేశం కల్పిస్తుందని, ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు విరుద్దంగా ఉన్న వివక్షపూరిత చర్యలను సరిదిద్దుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. విదేశాల్లోని చైనా సంస్థలు అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి పని చేయాలని, వాటి నిబంధనలకు అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహించాలని, ప్రజా శాంతి, ఉత్తమ నైతిక విలువలను పాటించాలని తమ దేశం కోరుకుంటుందని అన్నారు. చైనా, భారత్ పరస్పరం ముప్పు కాదని, అభివృద్ధికి అవకాశాలు అని రోంగ్ వ్యాఖ్యానించారు. చర్చలు, సంభాషణల ద్వారా పరస్పర ప్రయోజనాల కోసం ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య సంబంధాలను తిరిగి సరైన మార్గంలోకి తీసుకురావాలని ఆయన సూచించారు. సరిహద్దుల్లో తూర్పు లడఖ్‌ వద్ద భారత్, చైనా సైన్యాల మధ్య ఆరు నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. భారత్‌, చైనా మధ్య నెలకున్న ప్రతిష్టంభన నేపథ్యంలో దేశ, ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్న మొబైల్ యాప్‌లను గుర్తించి, కేంద్ర ప్రభుత్వం నిషేధం విధిస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 220 యాప్‌లపై నిషేధం విధించింది కేంద్ర౦.

Tags :

Advertisement