Advertisement

తెలంగాణలో 49 లక్షలు దాటిన కరోనా పరీక్షల సంఖ్య

By: chandrasekar Wed, 18 Nov 2020 2:13 PM

తెలంగాణలో 49 లక్షలు దాటిన కరోనా పరీక్షల సంఖ్య


రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు ప్రతి పది మందిలో ఒకరికి వైరస్‌ నిర్ధారణ టెస్టు పూర్తయింది. ఈ క్రమంలోనే మొత్తం పరీక్షల సంఖ్య 49 లక్షలు దాటింది. ప్రస్తుతం కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నప్పటికీ వైద్యారోగ్యశాఖ ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా, రోజుకు సగటున 50 వేల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నది. ఈ సంఖ్యను 60 వేలకు పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పుడు వైరస్‌ను నిర్ధారించడం చాలా క్లిష్టంగా ఉండేది. శాంపిళ్లను సేకరించి పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపిస్తే దాదాపు రెండు రోజుల సమయం పట్టేది. భవిష్యత్‌ ప్రమాదాన్ని అంచనా వేసిన తెలంగాణ ప్రభుత్వం టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ట్రీట్మెంట్‌ విధానాన్ని పక్కాగా అమలుచేసింది. దీంతో ప్రస్తుతం పెద్దసంఖ్యలో ఆర్టీపీసీఆర్‌, ర్యాపిడ్‌ యాంటీజన్‌ పరీక్షలు నిర్వహించుకొనే స్థాయికి ఎదిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 49 లక్షల పరీక్షలు నిర్వహించారు. ప్రతి 10 లక్షల మందికి చూసుకుంటే 1.31 లక్షల మందికి పరీక్ష నిర్వహిస్తున్నట్టు గణాంకాలు తెలియచేస్తున్నాయి. ఒకవైపు వైరస్‌ ప్రభావం తగ్గుతున్నప్పటికీ విశ్రమించకుండా, పరీక్షల సంఖ్యను మరింత పెంచేందుకు వైద్యారోగ్యశాఖ కృషిచేస్తున్నది. ప్రస్తుతం రోజూ సగటున 50 వేలవరకు టెస్టులు చేస్తుండగా, ఈ సంఖ్యను 60 వేలకు పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నది.

మొబైల్‌ టెస్టింగ్‌ కేంద్రాలు గ్రామాల్లో...

రాష్ట్రంలో 60 ఆర్టీపీసీఆర్‌ పరీక్ష కేంద్రాలు పనిచేస్తున్నాయి. ముందు చూపుతో ఆర్టీపీసీఆర్‌ కేంద్రాల ఏర్పాటుకు ప్రత్యేక శ్రద్ధ చూపడంతో హైదరాబాద్‌కే పరిమితమైన ఈ కేంద్రాలు జిల్లాలకు విస్తరించాయి. ఎంతో విలువైన కోబాస్‌ మిషన్‌ సైతం నిమ్స్‌కు చేరుకోవడంతో రోజుకు అదనంగా 4000 కరోనా పరీక్షలు చేసే అవకాశం లభించింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 1,200 పైగా వైరస్‌ నిర్ధారణ కేంద్రాలను వైద్యారోగ్యశాఖ నిర్వహిస్తున్నది. ఆర్టీపీసీఆర్‌ పరీక్షల ఫలితాలు వచ్చేందుకు 24 గంటల సమయం పడుతుండటంతో, పాజిటివ్‌గా ఉన్నవారిని త్వరగా గుర్తించేందుకు ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులు నిర్వహిస్తున్నది. 300 మొబైల్‌ పరీక్ష కేంద్రాలను గ్రామాలకు పంపుతున్నది. కేసులు ఎక్కువగా నమోదైన గ్రామాలకు ఇవి చేరుకొని తక్కువ సమయంలోనే పరీక్షలు చేయనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా స్వల్పంగా కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం ఆదిలాబాద్‌, జనగామ, జయశంకర్‌ భూపాలపల్లి, జోగుళాంబ గద్వాల, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మహబూబ్‌నగర్‌, మహబూబాబాద్‌, ములుగు, నల్లగొండ, నారాయణపేట, నిర్మల్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్‌, వనపర్తి, వరంగల్‌ రూరల్‌, వరంగల్‌ అర్బన్‌, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కొత్త కేసులు పది లోపే వెలుగుచూశాయి. గత పది రోజుల గణాంకాలను పరిశీలిస్తే ఈ జిల్లాల్లో కేసులు చాలావరకు తగ్గుముఖం పట్టాయి. వారం రోజుల్లో జీహెచ్‌ఎంసీ, మేడ్చల్‌ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలు మినహా మరే ఇతర జిల్లాల్లో 100 కంటే ఎక్కువ కేసులు నమోదు కాకపోవడం గమనార్హం. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, పరిశుభ్రంగా ఉండటం వంటి జాగ్రత్తలను పాటించడం వల్ల వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట పడుతున్నదని నిపుణులు చెప్తున్నారు.

Tags :
|

Advertisement