Advertisement

  • పీవీ గురించి వర్ణించేందుకు మాటలు చాలవు: కేసీఆర్

పీవీ గురించి వర్ణించేందుకు మాటలు చాలవు: కేసీఆర్

By: chandrasekar Mon, 29 June 2020 11:53 AM

పీవీ గురించి వర్ణించేందుకు మాటలు చాలవు: కేసీఆర్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారత మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు గొప్ప సంస్కరణ శీలి అని కొనియాడారు. అందుకు తగ్గట్లుగానే ఆయన మాటకు ఎంతో విలువ ఉండేదని అన్నారు. పీవీ గురించి వర్ణించేందుకు మాటలు చాలవని కేసీఆర్ అన్నారు. పీవీ స్థాపించిన పాఠశాల నుంచి ఎంతో మంది ఐపీఎస్‌లు వచ్చారని అన్నారు. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కూడా ఆయన పాఠశాల నుంచి వచ్చిన వారే అని గుర్తు చేశారు.

నవోదయ వంటి పాఠశాల ఏర్పాటులో పీవీ భాగస్వామ్యం ఎంతో ఉందని అన్నారు. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో పీవీ జ్ఞానభూమి వద్ద శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. పీవీ 1200 ఎకరాల భూస్వామి. తమకు ఓ 150 ఎకరాలు ఉంచుకొని మిగతా అంతా ఉదారంగా ప్రభుత్వానికి అప్పగించిన వారు. అందుకే పీవీ మన ఠీవీ అని నేను అంటున్నా. ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా ఎన్నో సంస్కరణలు తెచ్చారు.

ముఖ్యంగా భూసంస్కరణలు. గెలుపులో, ఓటమిలో ఎప్పుడూ నిశ్చలంగా ఉండే వ్యక్తి. ఎన్ని విమర్శలు వచ్చినా తన లక్ష్యం చేరేవరకూ పట్టు సడలించేవారు కాదు. ఆయన ప్రధాని అయ్యే సమయానికి దేశమంతా అంధకారమయంలో ఉంది. ఉన్న బంగారమంతా విదేశీ బ్యాంకుల్లో పెట్టి పరువు నిలబెట్టుకున్న సందర్భం అది. అలాంటి సందర్భంలో ఆయన్నే వెతుక్కుంటూ పదవి వచ్చింది. ఆర్థిక సంస్కరణలతో దేశ ఆర్థిక స్థితిని గట్టెక్కించి సంచలన రేపారు. ‘‘దేశానికి గొప్పగా దిశానిర్దేశం చేసిన వ్యక్తికి రావాల్సిన గౌరవం లభించలేదు. మన రాష్ట్రం తరపున పీవీకి గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చేలా చేయాలి. ఆయన విధానాలను ముందు తరాలకు తెలియజేస్తే వ్యక్తిత్వ నిర్మాణానికి ప్రతీక అవుతుంది.’’ అని కేసీఆర్ తెలిపారు.

Tags :
|
|
|
|

Advertisement