Advertisement

  • శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టులో మళ్ళీ ఎటువంటి అగ్నిప్రమాదం జరగలేదు: జెన్కో సీఎండీ

శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టులో మళ్ళీ ఎటువంటి అగ్నిప్రమాదం జరగలేదు: జెన్కో సీఎండీ

By: chandrasekar Thu, 03 Sept 2020 1:46 PM

శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టులో మళ్ళీ ఎటువంటి అగ్నిప్రమాదం జరగలేదు: జెన్కో సీఎండీ


గత నెల 20వ తేదీన శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని 9 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మళ్ళీ అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో జెన్కో సివిల్ డైరెక్టర్ అజయ్ బృందంతో మాక్ డ్రిల్ నిర్వహించమని తెలంగాణ ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు ఆదేశించారు. సీఎండీ అదేశాలతోనే మాక్ డ్రిల్ నిర్వహించామని అధికారులు స్పష్టం చేశారు.

శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టులో ఎటువంటి అగ్నిప్రమాదం జరగలేదని, ఎవ్వరూ ఆందోళన చెందొద్దని సీఎండీ ప్రభాకరరావు స్పష్టం చేశారు. ఈ రోజు సాయంత్రం శ్రీశైలంలో భారీ ప్రమాదం జరిగినట్టు వార్తలు వచ్చాయి. విద్యుత్ తీగలను డీసీఎం వ్యాన్ తగలడంతో మంటలు అంటుకున్నాయని, భారీ శబ్దాలతో మంటలు ఎగసిపడ్డాయంటూ టీవీలు కొన్ని వీడియోలను ప్రసారం చేశాయి. దీంతో భయభ్రాంతులకు గురైన విద్యుత్ ప్లాంట్ సిబ్బంది బయటకు పరుగులు తీసిన దృశ్యాలు అందులో ఉన్నాయి. అయితే, అది ప్రమాదం కాదని, మాక్ డ్రిల్ అని సీఎండీ ప్రభాకర్ రావు స్పష్టం చేశారు.

ఆగస్టులో శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో 9 మంది చనిపోయారు. మొదటి యూనిట్‌లో ఓ ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. పెద్ద పెద్ద పేలుడు శబ్దాలతో మంటలు ఎగిసిపడ్డాయి. పవర్ హౌస్ లోపల దట్టమైన పొగ అలుముకోవడంతో ఏడుగురు టీఎస్ జెన్‌కో ఉద్యోగులు, ఇద్దరు అమరన్ బ్యాటరీ కంపెనీ సిబ్బంది అక్కడే చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో వారంతా చనిపోయారు.

శ్రీశైలం పవర్ ప్లాంట్‌ అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. ప్రమాదంలో చనిపోయిన డీఈ శ్రీనివాస్ గౌడ్ కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం.. ప్రమాదంలో చనిపోయిన మిగతా వారి కుటుంబాలకు రూ. 25 లక్షలు నష్టపరిహారం ఇవ్వనున్నట్టు మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఈ ప్రమాదానికి సంబంధించిన అటు ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. అలాగే, జెన్ కో కూడా సాంకేతిక కారణాలను విచారించేందుకు అంతర్గత కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదిక ఇంకా రావాల్సి ఉంది.

Tags :
|

Advertisement