Advertisement

  • స్టాలిన్ సోదరుడు అళగిరి నూతన పార్టీ పెట్టబోతున్నట్లు సమాచారం...

స్టాలిన్ సోదరుడు అళగిరి నూతన పార్టీ పెట్టబోతున్నట్లు సమాచారం...

By: chandrasekar Tue, 17 Nov 2020 5:08 PM

స్టాలిన్ సోదరుడు అళగిరి నూతన పార్టీ పెట్టబోతున్నట్లు సమాచారం...


తమిళ రాజకీయాల్లో.. కరుణానిధి పెద్ద కుమారుడు, డీఎంకే అధినేత స్టాలిన్ సోదరుడు ఎంకే అళగిరి నూతన పార్టీ పెట్టబోతున్నట్లు పెద్ద చర్చ నడుస్తోంది. ఇప్పటికే దాదాపు అన్ని ప్రణాళికలు పూర్తయ్యాయని, త్వరలోనే పార్టీని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా అళగిరికి మిగిలిన ఏకైక చివరి అవకాశం ఇదేనని అందుకే వచ్చే 2021 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ పార్టీని ప్రారంభిస్తున్నారు అంటున్నారు. అయితే దక్షిణాదిలో ఎప్పుడెప్పుడు పాగా వేద్దామా అని ప్రణాళికలు వేస్తున్న బీజేపీ దీనిని క్యాష్ చేసుకునే పనిలో ఉందట. సరిగ్గా చెప్పాలంటే అళగిరి పార్టీ ఏర్పటు వెనుక బీజేపీ హస్తం ఉందనే ప్రచారం సాగుతోంది. కేంద్ర మంత్రి అమిత్ షాతో నవంబర్ 21న అళగిరి కలవనున్నారని.. ఇద్దరి మధ్య కొంత కాలంగా సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయని బీజేపీకి చెందిన ఓ నేత చెప్పారు. అమిత్ షా త్వరలో చెన్నైకి రానున్నారని, ఆ పర్యటనలో ఎలాంటి మార్పులు జరగకపోతే ఆ మరుసటి రోజే ఇద్దరి మధ్య ‘వన్ ఆన్ వన్’ మీటింగ్ జరుగుతుందని అన్నారు. అయితే ఈ చర్చల గురించి తనకు ఏమీ తెలియదని తమిళనాడు బీజేపీ ఛీఫ్ ఎల్ మురుగన్ తెలిపారు. ఇదే విషయమై అళగిరి నుంచి కూడా ఎటువంటి ప్రకటనలు రాలేదు.

ఓ బీజేపీ నేత మాట్లాడుతూ ‘‘చాలా రోజుల నుంచి చర్చలు కొనసాగుతున్నాయి. అళగిరిని పార్టీ నుంచి, కుటుంబం నుంచి పంపించారు. దానికి బదులు తీర్చుకోవడానికి దాంతో పాటే స్టాలిన్‌కు గట్టి సమాధానం ఇవ్వడానికి ఇదే సరైన అవకాశం, బహుశా ఇదే చివరి అవకాశం కూడా కావచ్చు. ఎందుకంటే అళగిరి వ్యాపారాలు చాలా చిక్కుల్లో ఉన్నాయి. డీఎంకే అధికారంలోకి వస్తే అవి మరింత ఇబ్బందుల్లోకి పడిపోతాయి’’ అని పేర్కొన్నారు. అయితే బీజేపీ నుంచి దీనిపై స్పష్టమైన సందేశాలే అందుతున్నప్పటికీ అళగిరి మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. అళగిరి పార్టీ పేరు ఇప్పటికే ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘కలైంగర్ డీఎంకే’ కానీ ‘కేడీఎంకే’ అనే పేర్లతో ఈ పార్టీ ఉండబోతోందట. డీఎంకేకు స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ యూత్ వింగ్ అధ్యక్షుడిగా ఉన్నట్లుగానే కేడీఎంకేకు దయానిధి స్టాలిన్ యూత్ వింగ్ బాధ్యతలు తీసుకోనున్నారట. త్వరలోనే 100-200 మంది అనుచరులతో కలిసిన అనంతరం మధురైలో అళగిరి తన పార్టీ ప్రకటన చేయనున్నట్టు బలంగా వార్తలు వినిపిస్తోన్నాయి.

అళగిరి కదలికలపై డీఎంకేకు చెందిన ఓ సీనియర్ నేత కన్నేసి ఉంచారట. బీజేపీతో కలిసి చేసిన చర్చలు, స్థానికంగా వారి ప్రతి కదలికను నిశితంగా పరిశీలిస్తున్నారట. అనంతరం, దీనిపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్టాలిన్‌కు తెలిపారని సమాచారం. అళగిరి గత ఆరేళ్లుగా బయట ఎక్కడా కనిపించడం లేదని.. నియోజకవర్గంలో సరిగా లేరని, డబ్బు తక్కువగా ఉందని, అంతే కాకుండా తమిళ రాజకీయాల్లో ఆయన ప్రభావం అసలు ఉండదని డీఎంకే నేత అన్నారట. అళగిరి పార్టీ పెట్టినా ఒక్క రోజు కూడా వార్తా పత్రికల్లో మొదటి పేజీలో వార్త రాలేదని డీఎంకే నేతల విశ్వాసం. పైగా రాష్ట్రంలో అసలు ఏమాత్రం ఉనికి లేని బీజేపీతో వెళ్లడం కూడా తమపై ఎలాంటి ప్రభావం పడదని వారు చెబుతున్నారు. అళగిరి చివరి సారిగా ఓ పెద్ద ర్యాలీ నిర్వహించారు. కరుణానిధి మరణించిన నెల రోజుల అనంతరం, 2018 సెప్టెంబర్‌లో చెన్నైలో పెద్ద ర్యాలీ తీశారు. అప్పటి నుంచి ఆయన ఎక్కడా పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు. 2014లో పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో ఆయనను డీఎంకే నుంచి తొలగించారు.

Tags :

Advertisement