Advertisement

  • కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేసిన న్యూజిలాండ్

కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేసిన న్యూజిలాండ్

By: Sankar Mon, 17 Aug 2020 11:09 AM

కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేసిన న్యూజిలాండ్


క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో న్యూజిలాండ్‌లో జాతీయ ఎన్నిక‌ల‌ను వాయిదా వేశారు. వైర‌స్ పాజిటివ్ కేసులు అధికం అవుతున్న నేప‌థ్యంలో సాధార‌ణ ఎన్నిక‌ల‌ను నెల రోజుల పాటు వాయిదా వేస్తున్న‌ట్లు న్యూజిలాండ్ ప్ర‌ధాని జెసిండా ఆర్డెర్న్ తెలిపారు. వాస్త‌వానికి ఆ దేశంలో ఎన్నిక‌లు సెప్టెంబ‌ర్ 19వ తేదీన జ‌ర‌గాల్సి ఉన్న‌ది.

కానీ ఆ ఎన్నిక‌ల‌ను నెల రోజుల‌కు వాయిదా వేశారు. కొత్త తేదీల ప్ర‌కారం న్యూజిలాండ్ ఎన్నిక‌లు అక్టోబ‌ర్ 17వ తేదీన జ‌ర‌గ‌నున్నాయి. కొత్త తేదీ వ‌ల్ల రాజ‌కీయ పార్టీలు త‌మ వ్యూహాల‌ను ర‌చించుకోవ‌చ్చు అని ప్ర‌ధాని జెసిండా తెలిపారు. రాబోయే 9 వారాలు పార్టీలు త‌మ ప్ర‌చారాన్ని నిర్వ‌హించుకోవ‌చ్చు అని, ఎన్నిక‌ల క‌మిష‌న్ దీనికి అంగీక‌రించిన‌ట్లు ఆమె చెప్పారు.

ఎన్నిక‌ల‌ను మ‌రింత ఆల‌స్యం చేయ‌డం త‌న‌కు కూడా ఇష్టం లేదని ప్ర‌ధాని అ‌న్నారు. ప్ర‌తిప‌క్ష నేష‌న‌ల్ పార్టీ మాత్రం ఎన్నిక‌ల తేదీల‌ను మ‌రింత వాయిదా వేయాల‌ని కోరుతున్నాయి. అయితే ఇటీవ‌లే ఆక్లాండ్‌లో కేసులు పెర‌గ‌డంతో లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను అమ‌లు చేస్తున్నారు. కొత్త‌గా 9 కేసులు న‌మోదు కావ‌డంతో ఆ న‌గ‌రంలో కేసుల సంఖ్య 58కి చేరుకున్న‌ది. మూడు నెల‌లు ఎటువంటి కేసులు న‌మోదు కాని న్యూజిలాండ్‌లో అక‌స్మాత్తుగా న‌మోదు అయిన కొత్త కేసులు ఆ దేశంలో కొంత టెన్ష‌న్ పుట్టిస్తున్నాయి.

Tags :
|

Advertisement