Advertisement

  • వరదల్లో సర్టిఫికెట్స్ పోగొట్టుకున్న వారికి కొత్తవి...

వరదల్లో సర్టిఫికెట్స్ పోగొట్టుకున్న వారికి కొత్తవి...

By: chandrasekar Wed, 21 Oct 2020 5:34 PM

వరదల్లో సర్టిఫికెట్స్ పోగొట్టుకున్న వారికి కొత్తవి...


తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా పోటెత్తిన భారీ వరదలు దాదాపు అన్ని ప్రాంతాలు పూర్తి జలమయం అయ్యాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌ని ఇంతకు ముందెప్పుడూ చూడని విధంగా భారీ వరదలు ముంచెత్తాయి. ఈ వరదల్లో ఇళ్లు నీట మునిగిన చోట వరద బాధితులు ఎన్నో కష్టాలు పడ్డారు. అందులో చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యల్లో విద్యార్థుల సర్టిఫికెట్స్ సమస్య ఒకటి. వరదల్లో సర్టిఫికెట్స్ తడిసి ముద్దవడం,నీళ్లల్లో కొట్టుకుపోవడం, వరదల తర్వాత సర్టిఫికెట్స్ కనిపించక పోవడం వంటి పరిణామాలు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆందోళనలోకి పడేశాయి. వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన చోట తమ గోడు వెళ్లబోసుకుంటున్న బాధితులు అధిక సంఖ్యలో చెబుతున్న విషయాల్లో సర్టిఫికెట్స్ కోల్పోవడం కూడా ఒకటి కావడంతో సర్టిఫికెట్లు పాడైపోయిన వారికి, పోగొట్టుకున్న వారికి వాటి స్థానంలో కొత్తవి జారీ చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

మంగళవారం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆదేశాలతో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సర్టిఫికెట్స్ కోల్పోయిన వారు కొత్త వాటి కోసం లేదా డూప్లికేట్‌ సర్టిఫికెట్ల కోసం ఆన్‌లైన్‌‌లో కానీ లేదా ఆఫ్‌లైన్‌‌లో కానీ దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. దరఖాస్తులను త్వరగా పరిశీలించి విద్యార్థులకు అవసరమైన సర్టిఫికెట్స్ వీలైనంత త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సంబంధిత అధికారులకు సూచించారు. పోటీ పరీక్షలకు ఉపాధి అవకాశాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు, విద్యార్థులకు ఈ వార్త కొంత ఊరట కలిగించింది. మరోవైపు భారీ వర్షాలు, వరదల కారణంగా విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న అన్ని పరీక్షలను దసరా వరకు వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్శిటీ, డా. బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఆయా విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్స్ ప్రకటించారు.

Tags :
|

Advertisement