Advertisement

  • నివర్ సైక్లోన్: నేటి నుంచి 27 వరకు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశ౦...

నివర్ సైక్లోన్: నేటి నుంచి 27 వరకు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశ౦...

By: chandrasekar Wed, 25 Nov 2020 2:48 PM

నివర్ సైక్లోన్: నేటి నుంచి 27 వరకు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశ౦...


తమిళనాడును నివర్ తుపాను వణికిస్తోంది. అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందిన నివర్ తుపాను తీరం వైపు దూసుకొస్తుంది. ప్రస్తుతం ఇది తమిళనాడులోని కడలూరుకు తూర్పు ఆగ్నేయ దిశగా 310 కిమీ దూరంలో, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 320 కిమీ దూరంలో, చెన్నైకి ఆగ్నేయంగా 380 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. గత ఆరు గంటలుగా గంటకు 6 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా పయనిస్తోంది. మరోవైపు నివర్ ప్రభావంతో తమిళనాడులో ఇప్పటికే అనేక జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యవసర విభాగాలకు మినహా తమిళనాడులో నేడు సెలవు ప్రకటించారు. తమిళనాడులోని ఏడు జిల్లాల్లో ప్రజా రవాణా నిలిపివేశారు. అత్యవసర సేవలు మినహా అన్నింటిని పూర్తిగా రద్దు చేశారు. అతి తీవ్ర తుపాను కారైక్కాల్, మామల్లపురం మధ్య తీరం దాటుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. తీరం దాటే సమయంలో కడలూరు, విల్లుపురం, కల్లకురిచ్చి జిల్లాల్లోనూ, పుదుచ్చేరిలోనూ మూడ్రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

గంటకు 145 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశముందని తెలిపింది. ఇక తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ ఇప్పటికే మాట్లాడారు. అవసరమైన మేర సాయం చేస్తామని వారికి హామీ ఇచ్చారు. ఇక తెలుగు రాష్ట్రాలపై కూడా నివర్ కారణంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోనే కాకుండా తెలంగాణలోనూ భారీ వర్షపాతం నమోదవుతుందని అధికారులు పేర్కొన్నారు. నేటి నుంచి 27 వరకు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వివరించారు. నెల్లూరు జిల్లాకు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నివర్ తుపానుపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. తుపాను ప్రభావం రాష్ట్రంపై ఉంటుందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

Tags :
|
|
|

Advertisement