Advertisement

  • ధోనీని...విరాట్ కోహ్లీని పోలుస్తూ నెటిజన్ల సెటైర్లు...

ధోనీని...విరాట్ కోహ్లీని పోలుస్తూ నెటిజన్ల సెటైర్లు...

By: chandrasekar Thu, 12 Nov 2020 1:12 PM

ధోనీని...విరాట్ కోహ్లీని పోలుస్తూ నెటిజన్ల సెటైర్లు...


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్ 2020 సీజన్ మంగళవారం ముగియగా, గురువారం యుఏఈ నుంచి నేరుగా ఆస్ట్రేలియాకి భారత క్రికెటర్లు వెళ్లనున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత 14 రోజులు క్వారంటైన్‌లో ఉండనున్న టీమిండియా నవంబరు 27 నుంచి మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టుల సిరీస్‌ని ఆడనుంది. అయితే.. ఈ నాలుగు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్టు మ్యాచ్ ఆడిన తర్వాత విరాట్ కోహ్లీ స్వదేశానికి రానున్నాడు. ఈ మేరకు బీసీసీఐ కూడా ఓ స్పష్టమైన ప్రకటనని విడుదల చేసింది. జనవరి ఆరంభంలో విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ బిడ్డకి జన్మనివ్వబోతుండటంతో.. ప్రసవ సమయంలో ఆమె చెంత ఉండాలని ఆశిస్తున్న విరాట్ కోహ్లీ డిసెంబరు 21న ఫస్ట్ టెస్టు ముగియగానే భారత్‌కి వచ్చేయనున్నాడు. దాంతో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీతో విరాట్ కోహ్లీని పోలుస్తున్న నెటిజన్లు సెటైరికల్‌గా స్పందిస్తున్నారు. ధోనీ భార్య సాక్షి.. జీవాకి జన్మనిచ్చిన సమయంలో ధోనీ కూడా ఆస్ట్రేలియా టూర్‌లోనే ఉన్నాడు. ఆసీస్‌తో సిరీస్ ముగిసిన వెంటనే 2015 వన్డే ప్రపంచకప్ అక్కడే ప్రారంభంకానుండటంతో సాక్షి ప్రసవించినా ధోనీ భారత్‌కి రాలేదు. ప్రపంచకప్ ముగిసిన తర్వాతే భారత్‌కి వచ్చి జీవాని చూశాడు.

అప్పట్లో పితృత్వ సెలవులు తీసుకుంటారా..? అని ధోనీని ప్రశ్నించగా.. ‘‘ప్రస్తుతం నేను నేషనల్ డ్యూటీలో ఉన్నాను. ఈ బాధ్యత తర్వాతే ఏదైనా భారత్‌కి ఈ ప్రపంచకప్ చాలా ముఖ్యం’’ అని హుందాగా బదులిచ్చాడు. దాంతో టీమిండియాకి ఆడటం కంటే విరాట్ కోహ్లీకి తన వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమని మరోసారి తేటతెల్లమైందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ధోనీకి నీకు ఉన్న తేడా కూడా ఇదేనంటూ కొంత మంది చురకలు వేస్తున్నారు. ధోనీ కెప్టెన్సీలో టీమిండియా 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలవగా.. చెన్నై సూపర్ కింగ్స్‌కి కూడా మూడు ఐపీఎల్ టైటిల్స్‌ని ధోనీ అందించాడు. మరోవైపు భారత్‌కి కెప్టెన్‌గా ఇప్పటి వరకూ ఒక్క ప్రపంచకప్‌ని కూడా అందించలేకపోయిన విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లోనూ ఒక్కటైటిల్ కూడా గెలవలేకపోయిన విషయం తెలిసిందే.

Tags :
|

Advertisement