Advertisement

  • రైతులతో మళ్లీ విఫలమైన చర్చలు... డిసెంబర్ 9న మరోసారి...

రైతులతో మళ్లీ విఫలమైన చర్చలు... డిసెంబర్ 9న మరోసారి...

By: chandrasekar Sat, 05 Dec 2020 10:38 PM

రైతులతో మళ్లీ విఫలమైన చర్చలు... డిసెంబర్ 9న మరోసారి...


కేంద్రానికి-రైతులకు మధ్య శనివారం జరిగిన ఐదో సారి చర్చలు కూడా విఫలమయ్యాయి. కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటారా లేదా.. అయితే అవునని, లేదంటే లేదని రెండు ముక్కల్లో సమాధానం తేల్చేయాలని రైతు సంఘాలు పట్టుబడ్డాయి. 'ఎస్ ఆర్ నో' అంటూ సమావేశంలో ప్లకార్డులను ప్రదర్శించాయి. ముగ్గురు కేంద్రమంత్రులతో దాదాపు 4గంటలు పాటు జరిగినా చర్చల్లో ఎటువంటి పురోగతి లభించలేదు. కేంద్రంతో చర్చించి మరో కొత్త ప్రతిపాదనతో రైతుల ముందుకొస్తామని సమావేశం అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. 'కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండును సమావేశం ప్రారంభంలోనే కేంద్ర మంత్రులకు మేము స్పష్టంగా వినిపించాం. చట్ట సవరణలతో సంతృప్తి చెందేది లేదని చెప్పాం. మా స్టాండ్ చాలా క్లియర్‌గా ఉంది. డిసెంబర్ 9న మరోసారి సమావేశమయ్యేందుకు సమయం కోరారు. అందుకు మేము అంగీకరించాం. ప్రభుత్వం రాష్ట్రాలతో చర్చించి ఒక డ్రాఫ్ట్‌కి రూపకల్పన చేసి చర్చల రోజు మాకు అందించనుంది.' అని భారతీయ కిసాన్ సంఘానికి చెందిన రాకేష్ అనే రైతు నేత తెలిపారు.

నిజానికి నేటి సమావేశం నుంచి మధ్యలోనే బయటకెళ్లిపోతామని రైతులు కేంద్రమంత్రులను హెచ్చరించారు. అర్థం లేని చర్చలతో లాభం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ కేంద్రమంత్రులు వారిని బుజ్జగించడంతో చర్చలకు కూర్చొన్నారు. 'ఇవాళ రెండు భిన్నమైన సమస్యల గురించి చర్చించాం. న్యాయమైన పరిష్కారం లభించాలని మేము కోరుకుంటున్నాం. కానీ ఈరోజు సమావేశంలో అది సాధ్యపడలేదు. కాబట్టి డిసెంబర్ 9న మరోసారి రైతులతో చర్చలు జరుపుతాం. ప్రభుత్వం అన్ని సమస్యలపై చర్చలు జరుపుతుందని రైతులతో చెప్పాం. కనీస మద్దతు ధర కొనసాగుతుందని కూడా తెలిపాము. కొత్త చట్టాలతో వ్యవసాయ మార్కెట్ యార్డులకు వచ్చిన నష్టమేమీ లేదని చెప్పాం. నిజానికి సమస్యల పరిష్కారానికి రైతుల నుంచే ఏవైనా సలహాలు,సూచనలు వస్తే పని మరింత సులభమవుతుంది.' అని కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు.

Tags :

Advertisement