Advertisement

  • చరిత్ర సృష్టించిన నయామి ఒసాకా .. యుఎస్ ఓపెన్ రెండో సారి కైవసం

చరిత్ర సృష్టించిన నయామి ఒసాకా .. యుఎస్ ఓపెన్ రెండో సారి కైవసం

By: Sankar Sun, 13 Sept 2020 09:54 AM

చరిత్ర సృష్టించిన  నయామి ఒసాకా .. యుఎస్ ఓపెన్ రెండో సారి కైవసం


కరోనా కారణంగా కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించిన టెన్నిస్ గ్రాండ్స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ మహిళా సింగిల్స్ విజేత ఎవరో తేలింది. జపాన్‌ క్రీడాకారిణి, నాల్గో సీడ్‌ నయామి ఒసాకా విజేతగా నిలిచింది. భారత కాలమానం ప్రకారం ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఫైనల్లో ఒసాకా 1-6, 6-3, 6-3 తేడాతో అజరెంకాపై గెలిచి టైటిల్‌ను ఎగురేసుకుపోయింది.

తొలి సెట్‌ను ఒసాకా కోల్పోయినప్పటికీ మిగతా రెండు సెట్లలో ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా బరిలో నిలిచి టైటిల్‌ను సాధించింది. ఇది ఒసాకాకు రెండో యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌. 2018లో యూఎస్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచిన ఒసాకా.. ఏడాది గ్యాప్‌లోమరోసారి ఈ ప్రతిష్టాత్మక టోర్నీని సొంతం చేసుకుంది. ఆమెకు ఇది ఓవరాల్‌గా మూడో గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌. గతేడాది జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌ను ఆమె గెలుచుకున్న సంగతి తెలిసిందే.

కాగా ఈ మ్యాచ్‌లో అజరెంకా ఓడిన తీరు ఆమె ఆడిన సెమీఫైనల్‌ను గుర్తు చేసింది. సెరెనా విలియమ్స్‌తో జరిగిన సెమీస్‌లో అజరెంకా ఇలానే గెలిచి ఫైనల్‌కు చేరింది. తొలి సెట్‌ను 1-6 తేడాతో కోల్పోయిన అజరెంకా.. మిగతా రెండు సెట్లను 6-3, 6-3 తేడాతో గెలిచి తుదిపోరుకు అర్హత సాధించింది. ఇప్పుడు అదే అనుభవం అజరెంకాకు ఎదురుకావడం గమనార్హం.

Tags :
|
|
|

Advertisement