Advertisement

  • ఒక వృద్ధురాలిని చూసి చలించిపోయిన మంత్రి పేర్ని నాని

ఒక వృద్ధురాలిని చూసి చలించిపోయిన మంత్రి పేర్ని నాని

By: chandrasekar Tue, 04 Aug 2020 6:20 PM

ఒక వృద్ధురాలిని చూసి చలించిపోయిన మంత్రి పేర్ని నాని


కృష్ణా జిల్లా పెడన మండలం నడపూరు గ్రామానికి చెందిన పుట్టి వజ్రం అనే వృద్ధురాలు అష్టకష్టాలు పడుతూ మచిలీపట్నం చేరుకొంది. సోమవారం నుంచి వారం రోజుల పాటు మచిలీపట్నంలో సంపూర్ణ లాక్ డౌన్ అమలవుతుండటంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఇలాంటి పరిస్థితులలో ఆ పండుటాకు చేతి కర్ర సైతం లేని దయనీయ పరిస్థితుల్లో ఎండిపోయిన చెట్టుకొమ్మ పుల్లను ఆసరా చేసుకొని వణుక్కొంటూ రాష్ట్ర సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని కార్యాలయంకు చేరుకొంది. ఆవిడ మంత్రి నానిని చూడాలని అనుమతి ఇప్పించండని సెక్యూరిటీ సిబ్బందిని ప్రాధేయపడింది.

అదే సమయంలో విజయవాడ వెళ్లాల్సిన హడావిడిలో ఉన్న మంత్రి పేర్ని నాని ఆమె దీనావస్థను చూసి చలించిపోయారు. వెంటనే ఆమె వద్దకు వచ్చి ఆమె కష్టం గూరించి అడిగి తెలుసుకొన్నారు. ముఖానికి మాస్క్ సైతం లేని ఆ వృద్ధురాలికి తానే స్వయంగా మాస్క్ తొడిగారు. తనకు అందరూ ఉన్నా పట్టెడన్నం పెట్టేవారు కరువయ్యారని మంత్రి పేర్ని నాని ఎదుట ఆ వృద్ధురాలు కంటతడి పెట్టుకొంది. దీంతో మామ్మగారు మీరు వృద్ధాశ్రమంలో చేరతారా? నేనే స్వయంగా చేర్పించి అక్కడ మిమ్మలిని జాగ్రత్తగా చూడమని చెబుతాను. అని మంత్రి పేర్ని నాని ఆమెను అడిగారు.

దీంతో ఆ వృద్ధురాలు సంతోషంగా అంగీకరించడంతో మంత్రి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమెను తన కారులోనే ముందు సీటులో కూర్చోపెట్టుకొని స్థానిక ఈడేపల్లిలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వృద్ధాశ్రమంలో చేర్పించారు. అనంతరం మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ మనల్ని కని, పెంచి, పెద్ద చేసిన తల్లిదండ్రులను జీవిత చరమాంకంలో పట్టించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందన్నారు. పోషించలేని స్థితిలో ఉంటే, పెద్దవారిని వృద్ధాశ్రమంలోనైనా చేర్పించాలి గానీ, ఇలా నిర్దాక్షిణ్యంగా వదిలేయడం బాధాకరం అని అన్నారు.

Tags :
|

Advertisement