Advertisement

మునిసిపాలిటీలకు ఆరోగ్యకర పోటీలు

By: Dimple Mon, 31 Aug 2020 00:53 AM

మునిసిపాలిటీలకు ఆరోగ్యకర పోటీలు

పట్టణాల్లో ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని పురపాలికల్లో మొక్కల పెంపకం, పార్కుల అభివృద్ధి కార్యక్రమాల ప్రోత్సాహమే లక్ష్యంగా ‘గ్రీన్‌ స్పేస్‌ ఇండెక్స్‌’ పేరుతో దీన్ని రూపొందించింది. ఈ కార్యక్రమాన్ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. దీనికి సంబంధించి పట్టణాల్లో పాటించాల్సిన అంశాల వివరాలను ఆయా పురపాలికలకు అందజేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ పట్టణాల్లో గ్రీన్‌ కవర్‌, ఓపెన్‌ స్పేస్‌లపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. పట్టణాల్లో ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందని..ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు.

ఇప్పటికే హరితహారం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పచ్చదనాన్ని ప్రోత్సహిస్తున్నామని.. ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. ‘గ్రీన్‌ స్పేస్‌ ఇండెక్స్‌’ ద్వారా పచ్చదనం పెంపొందించే అత్యుత్తమ పురపాలికకు ఏటా అవార్డులు అందిస్తామని కేటీఆర్‌ చెప్పారు. నాలుగేళ్ల పాటు గ్రీన్‌స్పేస్‌ ఇండెక్స్‌ కొనసాగుతుందని.. పురపాలికల మధ్య పోటీతత్వం కోసం దీన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. పార్కులు, మొక్కల పెంపకం, రహదారుల వెంబడి పచ్చదనం, ఇంటి వద్ద మొక్కల పెంపకానికి ప్రాధాన్యమివ్వాలని కేటీఆర్‌ సూచించారు.

Tags :
|

Advertisement