Advertisement

  • సూర్య కుమార్ సూపర్ షో ...రాజస్థాన్ పై ముంబై ఇండియన్స్ ఘనవిజయం

సూర్య కుమార్ సూపర్ షో ...రాజస్థాన్ పై ముంబై ఇండియన్స్ ఘనవిజయం

By: Sankar Wed, 07 Oct 2020 06:51 AM

సూర్య కుమార్ సూపర్ షో ...రాజస్థాన్ పై ముంబై ఇండియన్స్ ఘనవిజయం


సమష్టి ప్రదర్శనతో ముంబై ఇండియన్స్‌ మరో విజయాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో ముంబై 57 పరుగుల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సూర్య కుమార్‌ యాదవ్‌ (47 బంతుల్లో 79 నాటౌట్‌; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీతో చెలరేగగా... రోహిత్‌ శర్మ (23 బంతుల్లో 35; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), హార్దిక్‌ పాండ్యా (19 బంతుల్లో 30 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు.

అనంతరం రాజస్తాన్‌ 18.1 ఓవర్లలో 136 పరుగులకే ఆలౌటైంది. జాస్‌ బట్లర్‌ (44 బంతుల్లో 70; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఒక్కడే మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. బుమ్రా (4/20) పదునైన బౌలింగ్‌లో దెబ్బ తీయగా... ప్యాటిన్సన్, బౌల్ట్‌లకు చెరో 2 వికెట్లు దక్కాయి. లక్ష్య ఛేదనలో మూడో ఓవర్‌ కూడా పూర్తి కాకముందే రాజస్తాన్‌ ఓటమి ఖాయమని, మిగతాదంతా లాంఛనమే అనిపించింది. చివరకు అదే జరిగింది. ఓవర్‌కు ఒకరు చొప్పున యశస్వి (0), స్టీవ్‌ స్మిత్‌ (6), సంజూ సామ్సన్‌ (0) వెనుదిరిగారు. పవర్‌ప్లేలో రాయల్స్‌ స్కోరు 31 పరుగులు మాత్రమే. అనంతరం మహిపాల్‌ లోమ్రోర్‌ (11), టామ్‌ కరన్‌ (15) కూడా విఫలమయ్యారు. ఓపెనర్‌ బట్లర్‌ ఒక్కడే పోరాడినా, అది జట్టుకు ఉపయోగపడలేదు.

గత మూడు మ్యాచ్‌లలోనూ విఫలమైన బట్లర్‌... ఈసారి దూకుడుగా ఆడగా, మరోవైపు నుంచి అతనికి కనీస సహకారం లభించలేదు. ఒక దశలో 16 బంతుల వ్యవధిలోనే ఐదు సిక్సర్లు బాదిన బట్లర్‌ 34 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. చివరకు లాంగాన్‌ బౌండరీ వద్ద పొలార్డ్‌ ఒంటి చేత్తో పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు అతను వెనుదిరిగాడు. ఆ తర్వాత రాయల్స్‌ గెలుపుపై ఎలాంటి ఆశలు పెట్టుకునేందుకు అవకాశం లేకపోయింది. ఆర్చర్‌ (11 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కొద్ది సేపు నిలబడినా, మరో 11 బంతులు మిగిలి ఉండగానే జట్టు ఆట ముగిసింది.

Tags :
|

Advertisement