Advertisement

  • ఐపీఎల్‌ చరిత్రలో ఆరోసారి ఫైనల్‌‌కి చేరిన జట్టుగా ముంబై ఇండియన్స్ రికార్డు...

ఐపీఎల్‌ చరిత్రలో ఆరోసారి ఫైనల్‌‌కి చేరిన జట్టుగా ముంబై ఇండియన్స్ రికార్డు...

By: chandrasekar Fri, 06 Nov 2020 03:54 AM

ఐపీఎల్‌ చరిత్రలో ఆరోసారి ఫైనల్‌‌కి చేరిన జట్టుగా ముంబై ఇండియన్స్ రికార్డు...


ముంబై ఇండియన్స్ ఇప్పటికే నాలుగుసార్లు ఐపిఎల్ టైటిల్ సొంతం చేసుకు౦ది. తాజాగా గురువారం జరిగిన క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లోనూ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 57 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌లో అడుగుపెట్టింది. దీంతో 13 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో ఆరోసారి ఫైనల్‌‌కి చేరిన జట్టుగా ముంబై ఇండియన్స్ రికార్డు సృష్టించింది. 201 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ముఖ్యమైన ఆటగాళ్లంతా ఆరంభంలోనే తడబడ్డారు. ముంబై బౌలర్లు జస్ప్రిత్ బుమ్రా 4/14, బౌల్ట్‌ 2/9 తో తీవ్ర కట్టడి చేశారు. దీంతో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 143 పరుగుల వద్దే ఆగిపోయింది. ఫలితంగా ముంబై ఇండియన్స్ జట్టు 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఓపెనర్స్ పృథ్వీ షా (0), శిఖర్‌ ధావన్‌ (0)తో పాటు మూడో బ్యాట్స్‌మేన్ అజింక్య రాహానె (0) డకౌటవడంతోనే ఢిల్లీ జట్టు పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయింది. బౌల్ట్‌ వేసిన తొలి ఓవర్లో పృథ్వీ షా, అజింక్య రహానె ఔట్ కాగా ఆ తర్వాతి ఓవర్లోనే జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో శిఖర్ ధావన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఈ సీజన్‌లో అంతగా రాణించని పృథ్వీ షాపై ముందు నుంచీ అంతగా ఆశలు లేకపోయినా పూర్తి ఫామ్‌లో ఉండి రెండు సెంచరీలు, మూడు అర్థ సెంచరీలు చేసిన శిఖర్ ధావన్‌పై జట్టు చాలా ఆశలే పెట్టుకుంది. ధావన్‌కి రహానే తోడు ఉంటాడనుకుంటే మూడు వికెట్లు వెంట వెంటనే పడ్డాయి. అనంతరం క్రీజులోకి వచ్చిన ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్ (12)‌ కూడా బుమ్రా వేసిన నాలుగో ఓవర్లో షాట్‌‌కి ప్రయత్నించి కవర్‌లో అడ్డంగా రోహిత్‌ శర్మ చేతికి దొరికిపోయాడు. దీంతో ఢిల్లీ జట్టు 20 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌లో చివర్లో మార్కస్‌ స్టొయినీస్‌, అక్షర్‌ పటేల్‌ పోరాడినప్పటికీ అప్పటికే పరిస్థితులు చేజారిపోవడంతో వారికి ఓటమి తప్పలేదు.

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్‌లో సూర్య కుమార్ యాదవ్‌ 51: 38 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు, ఇషాన్‌ కిషన్‌ 55 నాటౌట్‌: 30 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు అర్ధశతకాలతో రాణించారు. క్వింటన్‌ డికాక్‌ 40: 25 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ ఆకట్టుకునే ప్రతిభ కనబర్చాడు. ఆఖర్లో హార్డిక్‌ పాండ్య 37 నాటౌట్‌: 14 బంతుల్లో 5 సిక్సర్లు చెలరేగిపోవడంతో స్కోర్ బోర్డులో ఇంకొంత వేగం పెరిగింది. సమష్టికృషితో ముంబై జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 200 పరుగులు చేసింది.

Tags :

Advertisement